Telugu Global
National

సెక్షన్‌ 6ఏను సమర్థించిన సుప్రీం ధర్మాసనం

4:1 మెజారిటీతో తీర్పును వెలువరించిన సుప్రీం ధర్మాసనం. ఇది రాజ్యాంగ విరుద్ధమన్న జస్టిస్‌ పార్థీవాలా

సెక్షన్‌ 6ఏను సమర్థించిన సుప్రీం ధర్మాసనం
X

పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 6ఏను సమర్థిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. అక్రమంగా భారత్‌కు వలస వచ్చిన బంగ్లాదేశ్‌ వాసులకు పౌరసత్వాన్ని కల్పించడానికి సెక్షన్‌ 6ఏను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం 4:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది. న్యాయమూర్తుల్లో జస్టిస్‌ పార్థీవాలా మాత్రమే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. 'అక్రమ వలసలకు అసోం అకార్డ్‌ ఓ రాజకీయ పరిష్కారం. అదే సమయంలో సెక్షన్‌-6ఏ అనేది చట్టబద్ధమైన మార్గం. ఈ నిబంధనలు రూపొందించడానికి మెజారిటీతో కూడిన పార్లమెంటుకు శక్తి ఉన్నది. మానవీయ ఆందోళనలను పరిష్కరించడంతో పాటు.. స్థానికుల ప్రయోజనాలను కాపడే సమతౌల్యత ఈ సెక్షన్‌కు ఉన్నది. ఇక దీనిలోని కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైనదే. ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్‌ యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్‌ యుద్ధం నేపథ్యంలోనే ఈ సెక్షన్‌ తీసుకొచ్చిన విషయాన్ని ఇది చెబుతున్నది. ఈ సెక్షన్‌ అంత ఎక్కువగా జనాభాను కలుపుకోలేదు. మరీ తక్కువగాను విలీనం చేసుకోలేదనిపేర్కొన్నారు.

పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 6ఏ రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది. నాటి రాజీవ్‌గాంధీ సర్కార్‌ 1955 పౌరసత్వ చట్టంలో సెక్షన్‌ 6ఏను చేర్చింది. ఈ సెక్షన్‌ ప్రకారం విదేశీయులు పౌరసత్వం పొందినప్పటికీ 10 ఏళ్ల వరకు వారిని ఓటరు జాబితాలో చేర్చడం కుదరదని జస్టిస్‌ పార్థీవాలా తీర్పు చదవి వినిపించారు.

పౌరసత్వ చట్టం-1955 సెక్షన్‌ 6ఏ ప్రకారం.. 1966 జనవరి నుంచి 1971 మార్చి 25లోపు అసోంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఈ నిబంధనను 1985 అసోం అకార్డ్‌ తర్వాత తీసుకొచ్చారు. అసోంలోకి బంగ్లాదేశ్‌ వలసలపై ఉద్యమించిన వారితో కేంద్రం చేసుకున్న ఒప్పందమే ఇది. దీని చట్టబద్ధతపై అసోంలోని కొన్ని స్థానిక గ్రూపులు న్యాయస్థానంలో సవాల్‌ చేశాయి. ఇది రాజ్యాంగ పీఠికకు విరుద్ధమని, పౌరహక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ రాజకీయ హక్కులను హరించడమేనని వాదించాయి.


First Published:  17 Oct 2024 6:01 AM GMT
Next Story