Telugu Global
National

రామ్‌దేవ్‌ బాబా వివరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి

వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

రామ్‌దేవ్‌ బాబా వివరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి
X

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణలో భాగంగా యోగా గురువు రామ్‌ దేవ్‌ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణలపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణలో భాగంగా గతంలో పతంజలి సంస్థ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రామ్‌దేవ్‌ బాబా, పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. గత నెలలో పతంజలి సంస్థ క్షమాపణలు తెలియజేస్తూ దాఖలు చేసిన అఫిడవిట్‌పై అసహనం వ్యక్తం చేసింది. మీ క్షమాపణల వల్ల మేం సంతృప్తి చెందలేదు.. అని తెలిపింది. అంతేకాకుండా ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చర్యలకు సిద్ధంగా ఉండాలని వారిని హెచ్చరించింది. ఈ సందర్భంగా రామ్‌దేవ్‌ బాబా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

రామ్‌దేవ్‌ బాబా క్షమాపణలు చెప్పినప్పటికీ.. వారు అఫిడవిట్‌లో ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మసనం.. వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబరులో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ.. అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని తేల్చిచెప్పింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో ఆ సంస్థ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

First Published:  2 April 2024 3:13 PM IST
Next Story