గుజరాత్‌లో జడ్జిల పదోన్నతుల వివాదంపై జూలైలో విచారణ.. - సుప్రీంకోర్టు వెల్లడి
జస్టిస్ ఎం.ఆర్.షా సోమవారం పదవీ విరమణ చేశారు. పదోన్నతుల వ్యవహారంలో తమ తప్పేమీ లేకున్నా అవమానాలకు గురికావాల్సి వచ్చిందంటూ కొందరు న్యాయమూర్తులు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గుజరాత్‌లో వివాదాస్పదమైన దిగువ కోర్టు న్యాయమూర్తుల పదోన్నతుల వ్యవహారంపై జూలైలో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ అంశాన్ని చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం చెప్పింది. ప్రతిభ, సీనియారిటీ ఆధారంగానే పదోన్నతి కల్పించాలన్న సర్వీసు నిబంధనలను గుజరాత్ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ జస్టిస్ ఎం.ఆర్.షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 12న ఈ నియామకాలపై స్టే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రమోషన్లు పొందిన వారంతా తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించింది.
జస్టిస్ ఎం.ఆర్.షా సోమవారం పదవీ విరమణ చేశారు. పదోన్నతుల వ్యవహారంలో తమ తప్పేమీ లేకున్నా అవమానాలకు గురికావాల్సి వచ్చిందంటూ కొందరు న్యాయమూర్తులు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును జూలైలో విచారణకు చేపడతామని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తెలిపారు.
40 మంది పదోన్నతులను రద్దు చేసిన గుజరాత్ హైకోర్టు
దిగువ కోర్టు న్యాయమూర్తుల పదోన్నతుల వ్యవహారంలో ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 68 మంది న్యాయమూర్తులకు ఇచ్చిన పదోన్నతుల్లో 40 మంది పదోన్నతులను రద్దు చేసింది. మరో 21 మందికి ఇచ్చిన పదోన్నతులను కొనసాగిస్తూనే వారిని బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం రెండు నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. మిగతా ఏడుగురు జడ్జీల విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఈ నెల 12న జస్టిస్ ఎం.ఆర్.షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రక్రియపై నిలుపుదల(స్టే) ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీశ్ హస ముఖ్బాయ్ వర్మకు ఇచ్చిన పదోన్నతిని హైకోర్టు కొనసాగించింది. తొలుత ఆయనకు రాజ్‌కోట్‌లోని 16వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ ఇవ్వగా ఇప్పుడు 12వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించింది.