Telugu Global
National

రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. పరువు నష్టం కేసులో సుప్రీం స్టే

రాహుల్ అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు కానట్టే చెప్పుకోవాలి. వయనాడ్ ఎంపీగా ఆయన లోక్ సభకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.

రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. పరువు నష్టం కేసులో సుప్రీం స్టే
X

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మోదీ ఇంటి పేరు కేసులో ఆయనకు పడిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈమేరకు సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. రాహుల్ ని దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపి వేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావని, ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించింది సుప్రీం.

మోదీ ఇంటిపేరు విషయంలో వేసిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆటోమేటిక్ గా ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దయింది. హడావిడిగా ఆయన క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ శిక్ష అమలు నిలిపివేయాలంటూ రాహుల్ గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించినా ఫలితం కనపడలేదు. చివరకు సుప్రీంకోర్టు రాహుల్ మొర ఆలకించింది. శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

రాహుల్ పై పరువు నష్టం దావా వేసిన గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు రాహుల్ తరపు న్యాయవాది. రాహుల్‌ గాంధీ నేరస్థుడు కాదని, బీజేపీ కార్యకర్తలు గతంలోనూ ఆయనపై అనేక కేసులు వేసినా, ఎందులోనూ శిక్ష పడలేదని సుప్రీంకు తెలిపారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. ఇదే ఆయనకు చివరి అవకాశమని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు కానట్టే చెప్పుకోవాలి. వయనాడ్ ఎంపీగా రాహుల్ లోక్ సభకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.

First Published:  4 Aug 2023 9:11 AM GMT
Next Story