Telugu Global
National

మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్..

ఇలాంటి వీడియోలు మనసుని కలచివేస్తాయని పేర్కొంది సుప్రీంకోర్టు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.

మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్..
X

మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలు మనసుని కలచివేస్తాయని పేర్కొంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. మణిపూర్ లో ఇద్దరు యువతులను నగ్నంగా నడివీధుల్లో ఊరేగించి అత్యాచారం చేయడం అమానుషం అని తెలిపింది. మహిళలను హింసకు సాధనాలుగా ఉపయోగించడం అంగీకరించలేని విషయం అని పేర్కొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భారత్ కు మాయని మచ్చ..

ఇప్పటి వరకు ఇలాంటి దారుణాలు భారత్ లో వెలుగుచూడలేదు. భారత్ లో అత్యాచారాలు పెట్రేగిపోతున్నా మరీ ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూసి ఉండం. బాధిత యువతులను బహిరంగంగా ఊరేగించి, బట్టలు లేకుండా చేసి, ఆటవస్తువుల్లా వారిని దారుణంగా హింసించిన ఘటన భారత్ ను తలదించుకునేలా చేసింది. మహిళలను పూజించే దేశం మనది అని చెప్పుకుంటాం, ఊరూవాడా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి పూజిస్తాం, ఊరేగిస్తాం. కానీ మణిపూర్ లో జరిగింది ఏంటి..? మే-4న ఈ దుర్మార్గం జరగగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అది వెలుగులోకి రావడమేంటి..? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది..? పోలీసులు ఏం చేస్తున్నారు..? అల్లర్లను ఆపడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం, కనీసం ఇలాంటి దుర్మార్గాలను కూడా ఆపలేకపోతే ఎలా..? అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.

సిగ్గు సిగ్గు..

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేస్తేనే అల్లాడిపోయారు బీజేపీ నేతలు. ఆ వీడియోలు ఎక్కడా కనపడకుండా చేశారు, పొరపాటున ఎవరైనా షేర్ చేస్తే వారి అంతు చూసేదాకా వదల్లేదు. మరి ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగిస్తే.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా షేర్ అవుతుంటే కేంద్రం చేష్టలుడిగి చూస్తోంది. సభ్య సమాజం చీత్కరించిన తర్వాత ఇప్పుడు చర్యలకు సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు లేకుండా చేస్తామంటూ స్టేట్ మెంట్లిస్తోంది.

విచిత్రం ఏంటంటే.. ప్రభుత్వంలోని నేతలు సైతం ప్రతిపక్షాల్లాగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. సానుభూతి ప్రకటిస్తున్నారు, నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్నది, మణిపూర్ లో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నమాట. అభివృద్ధిలో తాము గొప్ప అని చెప్పుకుంటున్న ఈ డబుల్ ఇంజిన్.. ఇలాంటి అసభ్యతకు, అనాగరికతకు కూడా కారణం కావడం నిజంగా దురదృష్టకరం. ఇన్నాళ్లూ మణిపూర్ గొడవలు కేవలం రెండు గిరిజన తెగల మధ్య జరిగినవే అనుకుంటూ కాలక్షేపం చేసిన కేంద్రానికి ఈ వీడియోలు నిజంగా చెంపపెట్టు. దీనికి మోదీ సమాధానం చెప్పడమే కాదు, కచ్చితంగా దేశానికి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి కేంద్రం సోషల్ మీడియాపై చిందులు తొక్కుతోంది. సుప్రీంకోర్టు హెచ్చరికల తర్వాతయినా దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, మణిపూర్ అల్లర్లను ఆపేందుకు ప్రయత్నిస్తుందేమో చూడాలి.

First Published:  20 July 2023 11:47 AM IST
Next Story