వివక్ష దేనికి..? కేంద్రానికి సుప్రీం చీవాట్లు..
బీజేపీ పాలిత మణిపూర్ లో జరిగిన హింసాకాండను కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకునే కేంద్రం.. బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
డబుల్ ఇంజిన్ అంటూ డబ్బా కొట్టుకుంటున్న కేంద్రానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఆ డబుల్ ఇంజిన్ విషయంలోనే సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడటం విశేషం. బీజేపీ పాలిత రాష్ట్రాల విషయంలో ఒకలా.. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి మరోలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు జరిగినప్పుడు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది.
ఎందుకీ ఆగ్రహం..?
నాగాలాండ్ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్రం ఆ ఆదేశాలు పాటించలేదు. దీంతో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
నాగాలాండ్ లో మహిళల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్నాయని చెప్పిన సుప్రీంకోర్టు.. మహిళల రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోతున్నారనే విషయం అర్థం కావడం లేదన్నది. రాజ్యాంగ నిబంధనను ఉల్లఘించి ఎలా వ్యవహరిస్తారనేది అర్థం కావడం లేదని జస్టిస్ ఎస్.కె.కౌల్ అన్నారు. విచారణ సందర్భంగా బీజేపీ పాలిత మణిపూర్ లో జరిగిన హింసాకాండను కూడా ఆయన ప్రస్తావించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకునే కేంద్రం.. బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.