గర్భస్రావంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
భర్త చనిపోయినా, విడాకులు తీసుకున్నా ఆ సమయంలో మహిళ తన గర్భాన్ని తొలగించుకునేందుకు చట్టం అనుమతి ఇస్తోందని.. అవాంఛనీయ గర్భంతో ఉన్న అవివాహితకు కూడా ఆ వెసులుబాటు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గర్భస్రావం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక అవివాహిత.. తన 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పెళ్లి కాకుండానే ఒక వ్యక్తితో పరస్పర అంగీకారంతోనే జీవించడం వల్ల తనకు గర్భం వచ్చిందని.. మారిన పరిస్థితుల కారణంగా దాన్ని తాను తొలగించుకోవాలనుకుంటున్నానని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్( ఎంటీపీ యాక్ట్) ప్రకారం గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వడం కుదరదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. చట్టంలోని ఏ సెక్షన్ కూడా సదరు మహిళ విషయంలో వర్తించడం లేదని ఢిల్లీ కోర్టు తేల్చిచెప్పింది. విచారణ సమయంలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. 24 వారాల గర్భం అంటే పసిబిడ్డను చంపడమే కదా అని వ్యాఖ్యానించింది. ఎందుకు పసిబిడ్డను చంపుకోవాలనుకుంటున్నారు.. పిల్లలను దత్తత తీసుకునే వారు బయట క్యూలో ఉన్నారంటూ అంటూ వ్యాఖ్యానించింది.
MTP యాక్ట్ ప్రకారం అత్యాచార బాధితులు, మైనర్లు, మానసిక సమస్యలున్న వారు, గర్భంలో లోపాలున్న వారు, గర్భం ఉన్న సమయంలో వైవాహిక జీవితంలో మార్పులకు( విడాకులు కానీ, భర్త చనిపోవడం గానీ) గురైన మహిళలు మాత్రమే అబార్షన్‌కు అవకాశం కలిగి ఉంటారని.. మణిపూర్‌కు చెందిన అవివాహితకు మాత్రం ఈ యాక్ట్‌లోని ఏ సెక్షన్ కూడా సానుకూలంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాను గర్భం తొలగించుకునేందుకు హైకోర్టు నిరాకరించడాన్నిసవాల్ చేస్తూ సదరు మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. MTPయాక్ట్‌ను అన్వయించుకోవడంలో ఢిల్లీ హైకోర్టు మితిమీరిన దృక్పథాన్ని తీసుకున్నట్టుగా ఉందని అభిప్రాయపడింది.
MTP యాక్ట్‌కు 2021లో సవరణ చేసిన సమయంలో భర్త అనే చోట భాగస్వామి అని చేర్చారని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అంటే పార్లమెంట్ ఉద్దేశం గర్భంతో ఉన్న మహిళ వైవాహిక జీవితంలో మార్పు అంటే అది భర్త వల్లనే జరిగి ఉండాలని కాదు.. భాగస్వామి వల్ల అని అర్థం వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భర్త చనిపోయినా, విడాకులు తీసుకున్నా ఆ సమయంలో మహిళ తన గర్భాన్ని తొలగించుకునేందుకు చట్టం అనుమతి ఇస్తోందని.. అవాంఛనీయ గర్భంతో ఉన్న అవివాహితకు కూడా ఆ వెసులుబాటు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సదరు స్త్రీని ఇష్టంలేని గర్భాన్ని మోయాల్సిందే అని చెప్పడం పార్లమెంట్ చేసిన చట్టం స్పూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. వితంతువైనా, విడాకులు తీసుకున్న మహిళ అయినా, అవివాహితులైనా,.. గర్భం ఇష్టం లేకపోతే 20-24 వారాలలోపు గర్భస్రావం చేయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు కోర్టు స్పష్టం చేసింది. సదరు మహిళకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా అబార్షన్ పూర్తి చేయాలని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో గర్భస్రావం చేయించుకునేందుకు చట్టపరమైన అనుమతి 20 వారాల వరకు మాత్రమే ఉండేది. 2021లో చట్ట సవరణ ద్వారా ఆ గడువును 24 వారాలకు పెంచారు. కేవలం ప్రత్యేక పరిస్థితులకు గురైన మహిళలు మాత్రమే అబార్షన్‌కు అర్హులు.