పిల్లలు 7కే వెళ్తుంటే మనం ఎందుకు రాలేం? - సుప్రీం
ఒక కేసులో బెయిల్ విచారణ సందర్భంగా సాధారణ పనివేళ కంటే గంట ముందుగానే యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం సమావేశమైంది.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి యూయూ లలిత్ కోర్టు సమయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తదుపరి ప్రధాన న్యాయమూర్తి రేసులో కూడా ఉన్నారు. పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూల్ కి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు త్వరగా కోర్టును ప్రారంభించకూడదు అని ఆయన ప్రశ్నించారు.
ఒక కేసులో బెయిల్ విచారణ సందర్భంగా సాధారణ పనివేళ కంటే గంట ముందుగానే యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం సమావేశమైంది. ఈ సందర్భంగా బెయిల్ పిటిషన్ పై వాదనలకు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభినందించారు. ఉదయం 9:30 కి కోర్టు ప్రారంభం కావడం చాలా మంచి పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో స్పందించిన సీనియర్ న్యాయమూర్తి లలిత్.. పిల్లలు ఉదయం 7గంటలకే స్కూల్ కి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు ఉదయం 9 గంటలకే కోర్టు పనులను ప్రారంభించకూడదు అని ప్రశ్నించారు. ఉదయం 9 గంటలకే కోర్టును ప్రారంభించడం వల్ల సాయంత్రం చాలా సమయం దొరుకుతుందని ఆ సమయంలో ఫైళ్లను పరిశీలించడం వంటి వాటికి అవకాశం ఉంటుందని లలిత్ వ్యాఖ్యానించారు.
ఉదయం 9 గంటలకే కోర్టు పనిచేయడం ప్రారంభించి 11.30కి అరగంట పాటు విరామం తీసుకుని, తిరిగి కోర్టు పనిచేస్తే మధ్యాహ్నం రెండు కల్లా కేసుల విచారణ పూర్తి చేయవచ్చని, ఆ తర్వాత మరుసటి రోజుకు సంబంధించిన కేస్ ఫైళ్లను పరిశీలించేందుకు సమయం ఉంటుందని వ్యాఖ్యానించారు. దాంతో స్పందించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఆగస్టు నెల నుంచి ఈ మార్పును తాము చూడవచ్చు అని ఆశిస్తున్నామన్నారు.
ఆగస్టు 26 తో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆ స్థానంలోకి లలిత్ రాబోతున్నారు. అందుకే ఆగస్టు నుంచి తాము ఈ మార్పు చూస్తామని అనుకుంటున్నామని న్యాయవాది వ్యాఖ్యానించినట్టు భావిస్తున్నారు. న్యాయమూర్తులు కేసుల విచారణను ఉదయం 10:30 నుంచి 4 గంటల వరకు కొనసాగిస్తూ ఉంటారు.