టీనేజ్ శృంగారం.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం
కొన్ని సందర్భాల్లో టీనేజ్ అమ్మాయిలు గర్భందాల్చితే వెంటనే అబ్బాయిలపై కేసు పెడుతున్నారు. ఇలాంటి కేసులతో చాలామంది టీనేజ్ అబ్బాయిల జీవితాలు జైలులో మగ్గిపోతున్నాయి. అమ్మాయి సమ్మతిని ఇక్కడ కోర్టు పరిగణలోకి తీసుకోదు.
16ఏళ్ల లోపు బాలికలతో వారి అనుమతి మేరకు శృంగారంలో పాల్గొన్నా చట్టరీత్యా అది నేరం. ఐపీసీ 375 ప్రకారం దాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు. 16 నుంచి 18 ఏళ్లలోపు బాలికలతో వారి అనుమతి పూర్వకంగా శృంగారం చేసినా కూడా అది నేరమే. అయితే ఇక్కడే ఓ చిన్న మతలబు ఉంది. బాలిక వయసు సరే, మరి బాలుడి వయసుని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేదే అసలు సమస్య. భారత్ లో మాత్రం బాలుడి వయసుని పరిగణలోకి తీసుకోరు. 16 ఏళ్ల బాలికతో ఆమె సమ్మతి మేరకు ఓ మధ్య వయస్కుడు శృంగారం చేసినా అది అత్యాచారమే. అదే వయసు బాలుడు ఆమె అనుమతితో ప్రేమ అనే మోజులో గీత దాటినా కూడా రేప్ కేసులో జైలులో వేస్తారు. ఈ తేడా ఎందుకంటూ సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలైంది. ఇలాంటి కేసుల్లో టీనేజ్ అబ్బాయిలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లాయర్ హర్ష విభోర్ సింఘాల్ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది.
విదేశాల్లో ఎలా..?
ఇతర దేశాల్లో రోమియో జూలియట్ చట్టం అమలులో ఉంది. టీనేజ్ అమ్మాయిల సమ్మతితో శృంగారంలో పాల్గొంటే విదేశాల్లో కూడా అది నేరం, కానీ అబ్బాయి వయసుని కూడా అక్కడ పరిగణలోకి తీసుకుంటారు. అంటే అబ్బాయి కూడా టీనేజ్ లో ఉంటే, శృంగారం వారిద్దరి అనుమతితో జరిగితే అందులో ఇద్దరి తప్పు లేదని నిర్థారిస్తారు. దీన్నే రోమియో జూలియట్ చట్టం అంటారు. అక్కడ అబ్బాయిలకు శిక్ష అరుదుగా ఉంటుంది. మనదేశంలో మాత్రం ఇద్దరూ కలసి తప్పు చేసినా, మైనర్ బాలిక తల్లిదండ్రులు కేసు పెడితే మాత్రం అబ్బాయి జైలుపాలవ్వాల్సిందే. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారా..?
కొన్ని సందర్భాల్లో టీనేజ్ అమ్మాయిలు గర్భందాల్చితే వెంటనే అబ్బాయిలపై కేసు పెడుతున్నారు. ఇలాంటి కేసులతో చాలామంది టీనేజ్ అబ్బాయిల జీవితాలు జైలులో మగ్గిపోతున్నాయి. అమ్మాయి సమ్మతిని ఇక్కడ కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఇప్పుడీ చట్టంపై చర్చ మొదలైంది. కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.