Telugu Global
National

లైంగిక వేధింపులు.. భారత్‌లో చాలా తీవ్రమైన అంశం.. – సుప్రీంకోర్టు

అస్సాంలోని రంగియాలో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్బీ) సంస్థలో ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసిన దిలీప్‌ పాల్‌ అనే అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది.

లైంగిక వేధింపులు.. భారత్‌లో చాలా తీవ్రమైన అంశం.. – సుప్రీంకోర్టు
X

లైంగిక వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారాయని, భారత్‌లో ఇది చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. పని ప్రదేశాల్లో ఏ రూపంలో లైంగిక వేధింపులు జరిగినా వాటిని తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ అధికారికి పెన్షన్లో 50 శాతం కోత పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సమర్థించింది.

అస్సాంలోని రంగియాలో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్బీ) సంస్థలో ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసిన దిలీప్‌ పాల్‌ అనే అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది. దీనిపై ఉన్నతస్థాయిలో విచారణ జరిగింది. విచారణ అనంతరం నిందితుడికి నెలనెలా వచ్చే పింఛనులో 50 శాతం కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాల్‌ చేస్తూ దిలీప్‌.. గువాహటి హైకోర్టును ఆశ్రయించాడు. పింఛనులో కోత పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు 2019లో తీర్పునిచ్చింది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.

హైకోర్టు తీర్పు పెద్ద తప్పిదం..

లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి పింఛనులో కోత పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పెద్ద తప్పిదమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దానిని కొట్టేస్తున్నామని తాజాగా ఇచ్చిన తీర్పులో తెలిపింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణించాలని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టంచేసింది. అలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తిని చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతించకూడదని తేల్చిచెప్పింది. అతడికి తగిన శిక్ష పడకపోయినా, తక్కువ శిక్షతో తప్పించుకున్నా బాధితురాలికి తీవ్ర అవమానం జరిగినట్టేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

First Published:  8 Nov 2023 8:39 AM IST
Next Story