Telugu Global
National

కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల ఆమోదంలో కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.

కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
X

ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి కొలీజియం సిఫార్సు చేసిన జాబితా నుంచి కేంద్రం కొంతమందిని మాత్రమే జడ్జిలుగా ఎంపిక చేసుకుంటోందని ఆరోపించింది. కొలీజియం సిఫారసులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ సుధాన్షు ధూలియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం చేసిన పలు సిఫార్సులను కూడా పెండింగులో పెట్టడం ఆందోళనకరమని తెలిపింది. ఈ పరిస్థితి చివరికి సుప్రీంకోర్టో, కొలీజియమో దీనిపై కేంద్రానికి రుచించని నిర్ణయం తీసుకునేందుకు దారి తీయదనే తాము ఆశిస్తున్నామని సుతిమెత్తగా హెచ్చరించింది.

న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల ఆమోదంలో కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేంద్రం ఈ తీరుగా చేయడం చాలా సమస్యలకు దారి తీస్తోందని జస్టిస్‌ కౌల్‌ ఆందోళన వెలిబుచ్చారు. ఇది పదేపదే సమస్యగా మారుతోందని, దీనిని తాము గతంలోనూ అటార్నీ జనరల్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కొన్ని సిఫార్సులను ఆమోదించి మరికొన్నింటిని పెండింగ్‌లో పెట్టడం న్యాయమూర్తుల సీనియారిటీ తదితర కీలక విషయాల్లో అనవసర సమస్యలకు తావిస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం వ్యవహార శైలిని చూసి సీనియర్‌ న్యాయవాదులు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.



కొన్ని సిఫార్సులను కేంద్రం వెంటనే ఆమోదిస్తోందని, అది అభినందనీయమేనని, కానీ చాలాసార్లు కొలీజియం సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే ఎంచుకుని ఆమోదిస్తుండటం ఆందోళనకరమని, దయచేసి దీనికి అడ్డుకట్ట వేయాలని ధర్మాసనం అటార్నీ జనరల్‌ వెంకట రమణికి సూచించింది. ఏ న్యాయమూర్తి ఏ హైకోర్టులో పని చేయాలన్నది న్యాయవ్యవస్థ నిర్ణయానికే వదిలేయడం సబబని తెలిపింది. ఈ అంశంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంతో సహనంతో వ్యవహరించిందని పిటిషనర్‌ తరఫున వాదించిన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. ఇక దీనిపై కోర్టే కేంద్రాన్ని ఆదేశించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేదంటే తామేం చేసినా చెల్లుతుందని అలుసుగా తీసుకునే ఆస్కారముందని చెప్పారు. దీనిపై గతంలోనే ఏజీని హెచ్చరించామని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ఆయన హామీ ఇచ్చారని జస్టిస్‌ కౌల్‌ గుర్తు చేశారు.

కేంద్రంతో లోతైన చర్చలకు మరింత సమయం కోరారన్నారు. కానీ ఆ తర్వాత కూడా కొలీజియం చేసిన ఇటీవలి సిఫార్సుల నుంచి కూడా కేంద్రం కొన్ని పేర్లనే ఎంచుకుని ఆమోదించిందంటూ అభ్యంతరం వెలిబుచ్చారు. ధర్మాసనం దీనిపై విచారణను నవంబర్‌ 20కి వాయిదా వేసింది.

First Published:  8 Nov 2023 6:05 AM GMT
Next Story