వందేభారత్‌కు హాల్ట్ కోరుతూ పిటిషన్.. సుప్రీం అసహనం
ఇప్పుడు వందేభారత్ రైలు ఏ స్టేషన్‌లో ఆగాలనేది నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నారు.. ఆ తర్వాత ఢిల్లీ, ముంబయి రాజధాని స్టాప్ ఎక్కడుండాలో కూడా మమ్మల్ని షెడ్యూల్ చేయమంటారా? అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
వందేభారత్ రైలుకు హాల్ట్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. ఇలాంటి అభ్యర్థనతో అత్యున్నత న్యాయస్థానానికి రావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలని పిటిషనర్‌కు కాస్త గట్టిగానే చెప్పింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కేరళలోని మలప్పురం జిల్లాలో గల తిరూర్ రైల్వేస్టేషన్‌లో హాల్ట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్రానికి చెందిన న్యాయవాది పీటీ శీజిష్ తన పిటిషన్‌లో కోరారు. తొలుత కేరళ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్.. తిరూర్‌లో వందే భారత్‌ను ఆపాలని తొలుత నిర్ణయించారని, ఆ తర్వాత రాజకీయ కారణాలతో రైల్వే శాఖ ఆ నిర్ణయాన్ని మార్చుకుందని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో.. పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం దీనిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసింది.
ఇప్పుడు వందేభారత్ రైలు ఏ స్టేషన్‌లో ఆగాలనేది నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నారు.. ఆ తర్వాత ఢిల్లీ, ముంబయి రాజధాని స్టాప్ ఎక్కడుండాలో కూడా మమ్మల్ని షెడ్యూల్ చేయమంటారా? అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటివి తాము ప్రభుత్వానికి చెప్పలేమని తేల్చి చెప్పింది. ఇది విధానపరమైన అంశమని, దీనిపై అధికారుల దగ్గరకు వెళ్లాలని సూచించింది.
రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలనేది రైల్వే శాఖ నిర్ణయిస్తుందని తెలిపింది. ముఖ్యంగా వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్ల హాల్ట్‌లను ఇలాంటి డిమాండ్ల ప్రాతిపదికన నిర్ణయించడం సరికాదని చెప్పింది. ప్రతి జిల్లా నుంచి ఓ వ్యక్తి తమకు నచ్చిన రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఉండాలని డిమాండ్ చేయడం ప్రారంభిస్తే.. హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు ప్రయోజనం లేకుండా పోతుందని తెలిపింది. ఎక్స్‌ప్రెస్ రైలు అనే పదానికి అర్థం కూడా లేకుండా పోతుందని వ్యాఖ్యానించింది. కనీసం తన పిటిషన్ ను పరిశీలించేలా ప్రభుత్వానికి సూచించాలని పిటిషనర్ అభ్యర్థించగా.. ధర్మాసనం అందుకు తిరస్కరించింది. తాము ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.