ఆ ప్రకటనలతో చదవలేకపోయానన్నాడు.. సుప్రీం చేతిలో చీవాట్లు తిన్నాడు
యూట్యూబ్ యాడ్స్ చూడటం ఇష్టంలేకపోతే మానేయాలని, అంతేకాని ఇలా నష్టపరిహారం ఇప్పించాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తులు.
కోర్టు సమయాన్ని వృథా చేశాడని, కేవలం ప్రచారం కోసమే పిటిషన్ వేశాడని మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్ నుంచి 75లక్షల రూపాయల పరిహారం కోరిన అతడికే లక్ష రూపాయల ఫైన్ విధించింది. తాను నిరుద్యోగినని, తప్పైపోయిందని వేడుకోవడంతో జరిమానాను 25వేలకు తగ్గించి వార్నింగ్ ఇచ్చింది.
కేసు ఏంటంటే..?
మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో విచిత్రమైన పిటిషన్ దాఖలు చేశాడు. యూట్యూబ్ లో వచ్చే అడ్వర్టైజ్ మెంట్లతో తన ఏకాగ్రత దెబ్బతిన్నదని, తాను చదువుకోలేకపోయానని, అశ్లీల ప్రకటనల వల్ల పోటీ పరీక్షలపై గురి పెట్టలేకపోయానని వివరించాడు. పోటీ పరీక్షలకోసం ఓ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసుకుంటే, కింద వచ్చే యాడ్స్ తో చదవలేకపోయానని చెప్పాడు. దీనికి పరిహారంగా యూట్యూబ్ నుంచి తనకు 75లక్షలు పరిహారం ఇప్పించాలని సుప్రీంకోర్టుని కోరాడు. అసలు యూట్యూబ్ లో యాడ్స్ నిషేధించాలన్నాడు. ఇంటర్నెట్ లో అశ్లీల కంటెంట్ ఆపేయాలన్నాడు.
సుప్రీం చీవాట్లు..
యూట్యూబ్ యాడ్స్ చూడటం ఇష్టంలేకపోతే మానేయాలని, అంతేకాని ఇలా నష్టపరిహారం ఇప్పించాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తులు. జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇలాంటి పిటిషనర్ల వల్లే న్యాయస్థానాల సమయం వృథా అవుతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. కేవలం పబ్లిసిటీ కోసం కోర్టును ఆశ్రయించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంటూ, కోర్టు సమయం వృథా చేసినందుకు గాను రూ.1 లక్ష జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఆ వ్యక్తి క్షమాపణలు చెప్పడంతో జరిమానా తగ్గించింది.