Telugu Global
National

లా కోర్సు తగ్గింపునకు సుప్రీంకోర్టు నో

ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపేందుకు నిరాకరించింది. ప్రస్తుత కోర్సు విధానం సరిగానే ఉందని, ఇందులో ఆలోచించడానికేమీ లేదని స్పష్టం చేసింది.

లా కోర్సు తగ్గింపునకు సుప్రీంకోర్టు నో
X

లా కోర్సును తగ్గించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు నిరాకరించింది. సాధారణంగా లా కోర్సు చదవాలనుకునేవారు డిగ్రీ తర్వాత మూడేళ్ల కోర్సు చేయొచ్చు. ఇంటర్‌ లేదా 12వ తరగతి పూర్తిచేసినవారు ఐదేళ్ల లా కోర్సు చదివేందుకు అర్హులు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ విధానాన్ని మార్చాలని, ఇంటర్‌ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రాన్ని, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఆదేశించాలని కోరుతూ పై పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌.. కోర్సును కుదించడం వల్ల మేధావులైన విద్యార్థులు మూడేళ్లలోనే న్యాయవాద కోర్సు (ఎల్‌ఎల్‌బీ)ను పూర్తిచేయగలరని తెలిపారు. ప్రస్తుత విధానం వల్ల ఐదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల పేదలు, ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపేందుకు నిరాకరించింది. ప్రస్తుత కోర్సు విధానం సరిగానే ఉందని, ఇందులో ఆలోచించడానికేమీ లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘మూడేళ్లు కూడా ఎందుకు.. హైస్కూల్‌ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్‌ మొదలు పెట్టేయండి’ అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతేకాదు.. న్యాయవాద విద్యకు ఐదేళ్ల కోర్సు కూడా తక్కువేనని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అయితే ప్రస్తుత విధానం సరిగ్గానే పనిచేస్తోందని, దీనిపై ఆలోచించడానికి ఏమీ లేదని చెప్పింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది.

First Published:  23 April 2024 8:09 AM IST
Next Story