Telugu Global
National

బాబా రాందేవ్‌కి సుప్రీంకోర్టు షాక్‌

ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రాందేవ్‌ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది.

బాబా రాందేవ్‌కి సుప్రీంకోర్టు షాక్‌
X

యోగా గురువు బాబా రాందేవ్‌కి దేశ అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారంటూ నమోదైన కేసులో విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు హాజరుకావాలంటూ నోటీసులిచ్చింది. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన బాబా రాందేవ్‌తో పాటు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పతంజలి సంస్థపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబరులో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

అయితే, ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రాందేవ్‌ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయంలోనూ కొన్ని సూచనలు చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ఎలాంటి ప్రచారం చేయొద్దని మరోసారి సూచించింది. అయితే, ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. దీంతో సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు ఇచ్చింది. తప్పుడు ప్రకటనలు వెంటనే ఆపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు వారిద్దరూ కోర్టు ముందు హాజరుకావాలని జస్టిస్‌ హిమ కోహ్ల, జస్టిస్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

First Published:  19 March 2024 3:46 PM IST
Next Story