క్షమాపణలు జాన్తా నై.. రాందేవ్‌బాబాపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మీరు కోర్టు పట్ల ఎలా అలక్ష్యంగా వ్యవహరించారో.. అలాగే మేమూ మీ దగ్గర ఎందుకు వ్యవహరించకూడదు? మీ క్షమాపణ మీద మాకు నమ్మకం లేదు. దాన్ని తిరస్కరిస్తున్నాం.. అని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, ఎండీ బాలకృష్ణ చెప్పిన క్షమాపణలను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. అవేమీ కుదరవు.. చర్యలకు సిద్ధంగా ఉండండి అని వారిని హెచ్చరించింది. వారిద్దరూ సమర్పించిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది.
పబ్లిసిటీ స్టంట్‌లా ఉంది
మీరు కోర్టు పట్ల ఎలా అలక్ష్యంగా వ్యవహరించారో.. అలాగే మేమూ మీ దగ్గర ఎందుకు వ్యవహరించకూడదు? మీ క్షమాపణ మీద మాకు నమ్మకం లేదు. దాన్ని తిరస్కరిస్తున్నాం.. అని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మాకు క్షమాపణలు చెప్పడానికి ముందే రాందేవ్‌బాబా, బాలకృష్ణ ఆ అఫిడవిట్లను మీడియాకు లీక్ చేశారు. అంటే వారు పబ్లిసిటీ కోసం చేసినట్లే కదా అని వారు కామెంట్ చేశారు.
లైసెన్సింగ్ అథారిటీలోని అధికారులను సస్పెండ్ చేయండి
పతంజలి ఉత్పత్తుల గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిస్తుంటే మీరేం చేస్తున్నారని ఉత్తరాఖండ్‌లోని లైసెన్సింగ్ అథారిటీని కూడా కోర్టు నిలదీసింది. పదే పదే ఉల్లంఘనలు జరుగుతుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. లైసెన్సింగ్ అథారిటీలో ఉన్న ముగ్గురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ఇది ఒక్క ఎఫ్ఎంసీజీ కంపెనీ వ్యవహారం కాదని.. కోర్టు తీర్పును ధిక్కరిస్తే ఎలా ఉంటుందో సమాజానికి తెలియాలని ఘాటుగా కామెంట్స్ చేసింది.