Telugu Global
National

ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు.. - నీట్‌లో అవకతవకలపై సమాధానం ఇవ్వాలని ఆదేశం

ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వడానికి ఏమైనా టైమ్‌ లైన్‌ను మీరు పెట్టుకుంటే తెలియజేయండి అని తెలిపింది. దీనిపై ఎన్టీఏను స్పందించనీయండి.. అంటూ పేర్కొంది.

ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు.. - నీట్‌లో అవకతవకలపై సమాధానం ఇవ్వాలని ఆదేశం
X

నీట్‌–యూజీ 2024 మార్కుల గణనలో ఇష్టారీతిన వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు దీనిపై ఎన్టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ)కి నోటీసులు జారీ చేసింది. జూలై 8వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నీట్‌–యూజీ 2024పై వచ్చిన మిగిలిన పిటిషన్లతో కలిపి అదేరోజు దీనిపైనా విచారణ చేపడతామని పేర్కొంది. మార్కుల గణనలో ఇష్టారీతిన వ్యవహరించారంటూ దాఖలు చేసిన పిటిషన్‌లో.. మెడికల్‌ పరీక్షకు హాజరైన చాలామంది ఓఎంఆర్‌ షీట్లను పొందలేదని పిటిషన్‌ దాఖలు చేసిన లెర్నింగ్‌ యాప్‌ పేర్కొంది.

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలను విన్నది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వడానికి ఏమైనా టైమ్‌ లైన్‌ను మీరు పెట్టుకుంటే తెలియజేయండి అని తెలిపింది. దీనిపై ఎన్టీఏను స్పందించనీయండి.. అంటూ పేర్కొంది. అదే సమయంలో కోచింగ్‌ సెంటర్లు పిటిషన్లు దాఖలు చేయడాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. ఇది కోచింగ్‌ సెంటర్ల వైపు నుంచి వచ్చిన 32వ పిటిషన్‌ అని, ఇందులో మీ ప్రాథమిక హక్కులకు ఏం ఉల్లంఘన జరిగింది.. అంటూ ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.

First Published:  27 Jun 2024 8:15 PM IST
Next Story