ముస్లిం విద్యార్థికి చెంపదెబ్బపై ఆగ్రహం, యూపీ ప్రభుత్వ నివేదిక కోరిన సుప్రీం
మతం పేరుతో ఓ చిన్నారికి ఇలా జరగడం సరికాదని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఘటనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ వహించాలని ఆదేశించింది.
యూపీలోని ఓ స్కూల్ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటనను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. మతం పేరుతో ఓ చిన్నారికి ఇలా జరగడం సరికాదని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఘటనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆగస్టు 24న ఖుబ్బాపూర్ గ్రామంలోని నేహా పబ్లిక్ స్కూల్‌లో త్రిప్తా త్యాగి అనే టీచర్ ఓ ముస్లిం చిన్నారిని ఇతర పిల్లలతో చెంపదెబ్బ కొట్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తమకు తీవ్ర అభ్యంతరాలున్నట్టు ధర్మాసనం పేర్కొంది.
పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఓ విద్యార్థిని స్కూల్లో అతని మతం ఆధారంగా చెంపదెబ్బలు కొట్టించడం, మతపరమైన వ్యాఖ్యలు చేస్తుంటే అసలు విద్యాహక్కు చట్టం అమలవుతుందా అని యోగీ సర్కార్‌ను ప్రశ్నించింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ మనస్సాక్షిని కదిలించాలని, ఈ ఘటన తర్వాత అయినా ప్రభుత్వం సదరు స్కూల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కౌన్సిలర్‌ని నియమించిందా అని ప్రశ్నించింది.
కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు వారం రోజుల్లోగా ఐపీఎస్ అధికారిని నియమించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఏయే సెక్షన్లు విధించాలో ఆ ఐపీఎస్ అధికారి చూసి సుప్రీంకోర్టుకు 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా సాక్షులకు కూడా భద్రత కల్పించాలని, చెంపదెబ్బ తిన్న చిన్నారిని మరో పాఠశాలలో చదివించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ఆ సంఘటన పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో దృష్టిలో ఉంచుకుని, కొట్టిన పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలని, దాంతో ట్రామా నుంచి అతడు కోలుకోగలడని యూపీ సర్కారును కోర్టు ఆదేశించింది.
♦