Telugu Global
National

మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పుబ‌ట్టిన సుప్రీంకోర్టు - శివ‌సేనలో రాజ‌కీయ సంక్షోభం అంశంపై వ్యాఖ్య‌లు

ఉద్ధ‌వ్ ఠాక్రే స‌భ‌లో మెజారిటీ కోల్పోయార‌నే నిర్ధార‌ణ వ‌చ్చేందుకు త‌గిన స‌మాచారం గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద లేన‌ప్పుడు.. స‌భ‌లో మెజారిటీ నిరూపించుకోమ‌ని ప్ర‌భుత్వాన్ని పిల‌వ‌డం స‌బ‌బు కాద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. గ‌వ‌ర్న‌ర్ విచ‌క్ష‌ణాధికారాల‌ను అమ‌లు చేసిన తీరు చ‌ట్ట‌ప‌రంగా లేద‌ని పేర్కొంది.

మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పుబ‌ట్టిన సుప్రీంకోర్టు  - శివ‌సేనలో రాజ‌కీయ సంక్షోభం అంశంపై వ్యాఖ్య‌లు
X

మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. శివ‌సేన పార్టీలో ఏర్ప‌డిన సంక్షోభం నేప‌థ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ‌ర్గం, షిండే వ‌ర్గం దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం.. అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌మ‌ర్థ‌నీయం కాదని వ్యాఖ్యానించింది. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ‌మూర్తుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తాజాగా దీనిపై స్పందిస్తూ.. ఈ విష‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేను తిరిగి ముఖ్య‌మంత్రిగా నియ‌మించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

ఉద్ధ‌వ్ ఠాక్రే స‌భ‌లో మెజారిటీ కోల్పోయార‌నే నిర్ధార‌ణ వ‌చ్చేందుకు త‌గిన స‌మాచారం గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద లేన‌ప్పుడు.. స‌భ‌లో మెజారిటీ నిరూపించుకోమ‌ని ప్ర‌భుత్వాన్ని పిల‌వ‌డం స‌బ‌బు కాద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. గ‌వ‌ర్న‌ర్ విచ‌క్ష‌ణాధికారాల‌ను అమ‌లు చేసిన తీరు చ‌ట్ట‌ప‌రంగా లేద‌ని పేర్కొంది. పార్టీలోని అంత‌ర్గ‌త వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌డానికి బ‌ల‌ప‌రీక్ష‌ను ఒక మాధ్య‌మంగా వాడ‌లేమ‌ని తెలిపింది.

అప్ప‌ట్లో ఉద్ధ‌వ్ ఠాక్రే బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కోకుండానే రాజీనామా చేశార‌ని, అందువ‌ల్ల తిరిగి ప్ర‌భుత్వాన్ని పున‌రుద్ధ‌రించ‌లేమ‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఠాక్రే రాజీనామాతో అప్ప‌ట్లో అతి పెద్ద పార్టీ అయిన‌ బీజేపీ.. ఏక‌నాథ్ షిండే వ‌ర్గానికి మ‌ద్దతివ్వ‌డంతో వారితో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌డం స‌మ‌ర్థ‌నీయ‌మేన‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీక‌ర్‌కు.. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు అన‌ర్హ‌త నోటీసులు జారీ చేసే అధికారాలు ఉంటాయా లేదా అనే అంశాన్ని విస్తృత ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేస్తున్నామ‌ని పేర్కొంది. ఈ అంశాన్ని మ‌రింత అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా తెలిపింది.

సుప్రీంకోర్టు త‌మ‌కు సానుకూలంగా స్పందించ‌డంతో ఏక్‌నాథ్ షిండే త‌న‌ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల‌పై ఉద్ధ‌వ్ వ‌ర్గం శివ‌సేన నేత సంజ‌య్‌రౌత్ మాట్లాడుతూ ఇది త‌మ‌కు నైతిక విజ‌య‌మ‌ని చెప్పారు. ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ట్ట‌విరుద్ధంగా ఏర్ప‌డింద‌ని సుప్రీంకోర్టు తెలిపింద‌ని ఆయ‌న వివ‌రించారు.

First Published:  12 May 2023 6:43 AM IST
Next Story