Telugu Global
National

అలాంటి దత్తపుత్రులకు ఫ్యామిలీ పింఛన్ వర్తించదు- సుప్రీంకోర్టు

ప్రస్తుత కేసులో దత్తపుత్రుడికి, మరణించిన ఉద్యోగికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అతడికి ఫ్యామిలీ పింఛన్ పొందే హక్కు లేదని చెప్పింది. ఉద్యోగి అయిన భర్త బతికి ఉన్న సమయంలోనే అతడి సమ్మతితో దత్తతు తీసుకుని ఉన్న సందర్భాల్లో మాత్రం ఫ్యామిలీ పింఛ‌న్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది.

అలాంటి దత్తపుత్రులకు ఫ్యామిలీ పింఛన్ వర్తించదు- సుప్రీంకోర్టు
X

దత్తత తీసుకున్న సంతనానికి పింఛన్‌ వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది. భర్త మరణించిన తర్వాత భార్య తీసుకున్న దత్తత బిడ్డకు పింఛన్ వర్తించదని స్పష్టం చేసింది. నాగ్‌పూర్‌లోని నేషనల్ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేసిన శ్రీధర్‌.. 1993లో పదవీ విరమణ పొంది ఆ మరుసటి ఏడాది చనిపోయారు.

ఆ తర్వాత అతడి భార్య ఒకరిని దత్తత తీసుకుంది. చనిపోయిన ఉద్యోగి శ్రీధర్‌కు తాను దత్త పుత్రుడిని అవుతానని.. కాబట్టి ఆయన వల్ల వస్తున్న పింఛన్‌ను తనకు వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉద్యోగి మరణానంతరం అతడి భార్య తీసుకున్న దత్త పుత్రుడికి పింఛన్ వర్తించదని స్పష్టం చేసింది. ఆ తర్వాత అతడు ముంబైలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి పింఛన్‌ అందేలా ఆదేశాలు తెచ్చుకున్నారు.

దీన్ని ప్రభుత్వం న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఆ వ్యవహారాన్ని విచారించిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త మరణించిన తర్వాత అతడి భార్య దత్తత తీసుకున్న బిడ్డకు పింఛన్ వర్తించదని స్పష్టం చేసింది. హిందూవారసత్వ చట్టం ప్రకారం.. భర్త సమ్మతి ఉంటేనే భార్య ఎవరినైనా దత్తతు తీసుకోవాల్సి ఉంటుందని.. అప్పుడు మాత్రమే సదరు బిడ్డకు ఫ్యామిలీ పింఛన్ వర్తిస్తుందని కోర్టు వివరించింది. భర్త మరణం తర్వాత ఒక మహిళ తన ఇష్టపూర్వకంగా మరో బిడ్డను దత్తతు తీసుకునే హక్కు ఉన్నప్పటికీ.. ఆ బిడ్డకు మరణించిన ఉద్యోగికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి.. పింఛన్‌కు దత్త బిడ్డ అర్హులు కారని తీర్పు చెప్పింది.

ప్రస్తుత కేసులో దత్తపుత్రుడికి, మరణించిన ఉద్యోగికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అతడికి ఫ్యామిలీ పింఛన్ పొందే హక్కు లేదని చెప్పింది. ఉద్యోగి అయిన భర్త బతికి ఉన్న సమయంలోనే అతడి సమ్మతితో దత్తతు తీసుకుని ఉన్న సందర్భాల్లో మాత్రం ఫ్యామిలీ పింఛ‌న్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. అలా కాకుండా ఉద్యోగి అయిన భర్త చనిపోయిన తర్వాత అతడి భార్య తీసుకునే దత్త బిడ్డకు పింఛన్‌ను వర్తింప చేస్తే పింఛన్ పొందే అవకాశం దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

First Published:  18 Jan 2023 10:44 AM IST
Next Story