బలవంతపు మత మార్పిళ్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. అలా కాకుండా ప్రలోభపెట్టి బలవంతంగా చేసే మార్పిళ్లు జాతీయ భద్రతకు ప్రమాదంగా మారుతాయని కోర్టు వ్యాఖ్యానించింది.
బలవంతపు మత మార్పిళ్లపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం అంతిమంగా జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని వ్యాఖ్యానించింది. అంతకు ముందే ఈ బలవంతపు వ్యవహారాలను కట్టడి చేయాల్సి అవసరం ఉందని అభిప్రాయపడింది.
బలవంతపు మత మార్పిళ్లపై న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమ కోహ్లి ధర్మాసనం విచారించింది. ఇలాంటి బలవంతపు మత మార్పిళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ఈ సమయంలో కోర్టు... ఇది చాలా తీవ్రమైన, ప్రమాదకరమైన వ్యవహారమని అభిప్రాయపడింది. తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. అలా కాకుండా ప్రలోభపెట్టి బలవంతంగా చేసే మార్పిళ్లు జాతీయ భద్రతకు ప్రమాదంగా మారుతాయని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇలాంటి బలవంతుపు మత మార్పిళ్లను ఎలా ఎదుర్కొంటారో అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. బెదిరింపుల ద్వారానో, ప్రలోభాల ద్వారానో జరిగే మత మార్పిళ్లను అడ్డుకుని తీరాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. దేశంలో పరిస్థితి చేయి దాటిపోక ముందే ఈ తంతుకు అడ్డుకట్ట వేయాలని వ్యాఖ్యానించింది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలంది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.