Telugu Global
National

ఎన్నికలవేళ ఈవీఎంలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఓటర్‌ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలుసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) తీసుకొచ్చింది.

ఎన్నికలవేళ ఈవీఎంలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈవీఎం - వీవీప్యాట్‌లలో పోలైన ఓట్ల క్రాస్ వెరిఫికేషన్ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను, వీవీ ప్యాట్ స్లిప్పులతో వందశాతం వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం.. అనవసర అనుమానాలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట లభించినట్లయింది.

ఈసీకి 2 కీలక సూచనలు..

1. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేయాలి. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలి.

2. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు వారంలోపు తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలి. ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలి. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే.. ఖర్చులు తిరిగి ఇవ్వాలి.

వీవీప్యాట్‌ ఎందుకు?

ఓటర్‌ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలుసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) తీసుకొచ్చింది. ఓటర్‌ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి స్క్రీన్‌పై 7 సెకన్లు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్‌ అమలు చేసింది. ఆ తర్వాత విడతల వారిగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ వచ్చింది.

సమస్య ఎక్కడ వస్తోంది..?

ఈవీఎంల పనితీరుపై చాలాకాలంగా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ అయితే ఈవీఎంలను బీజేపీ ట్యాంపర్ చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీపీప్యాట్‌ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తర్వాత వాటిని 100శాతం లెక్కించాలనే చర్చ వచ్చింది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం లేదని చెబుతోంది.

First Published:  26 April 2024 4:57 PM IST
Next Story