ఉరిశిక్ష ఖైదీల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
వాస్తవాలు, సాక్ష్యాలు, ఆధారాల ఆధారంగా తీర్పు ఉంటుందని, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పుదారి పట్టే అవకాశముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.
గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో ఉరిశిక్ష ఖైదీలను నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు ప్రకటించింది. అంతే కాదు.. వాస్తవాలు, సాక్ష్యాలు, ఆధారాల ఆధారంగా తీర్పు ఉంటుందని, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పుదారి పట్టే అవకాశముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
చావ్లా రేప్ కేసు పూర్వాపరాలివీ..
2012 ఫిబ్రవరి 9న ఢిల్లీ కుతుబ్ విహార్ వద్ద గుర్‌గావ్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో బాధితురాలిని కారులో వచ్చిన దుండగులు అపహరించారు. మూడు రోజుల తర్వాత హర్యానా రేవారి జిల్లా రోధాయి గ్రామ శివారులో సదరు యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం తీవ్ర సంచలనం రేపింది. కారులోని పనిముట్లు, కుండ పెంకులతో ఆమె జననావయాలను దుండగులు ఛిద్రం చేసి ఘోరంగా హింసించి చంపారు దుండగులు. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల ను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ కోర్టులో మరణశిక్ష.. హైకోర్టు సమర్థన..
ఢిల్లీ కోర్టు 2014 ఫిబ్రవరిలో ముగ్గురు నిందితులకూ మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అదే ఏడాది ఆగస్టు 26న ఢిల్లీ హైకోర్టు మరణశిక్షను సమర్ధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి దోషులను మానవ మృగాలుగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేశారు. వారు సమాజంలో తిరిగే హక్కు కోల్పోయారని వ్యాఖ్యానించారు.