Telugu Global
National

నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత అక్బ‌ర్ లోన్‌కు సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు గాను అక్బర్ లోన్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందని తెలిపారు.

నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత అక్బ‌ర్ లోన్‌కు సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు
X

నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత, ప్ర‌స్తుత ఎంపీ అక్బ‌ర్ లోన్‌ను.. భారత దేశ సార్వభౌమాధికారాన్ని అంగీకరించడంతో పాటు రాజ్యాంగం పట్ల విధేయతను చాటుతూ బేషరతుగా ప్రమాణ పత్రం (అఫిడవిట్) దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018లో ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ‘పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినదించారనే అంశంపై ధ‌ర్మాస‌నం సోమ‌వారం ఈ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

జ‌మ్మూ క‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే అధికర‌ణం 370 ర‌ద్దును స‌వాల్ చేసిన‌వారిలో అక్బ‌ర్ లోన్ ప్ర‌ధాన పిటిష‌న్‌దారు. ధ‌ర్మాస‌నం ఆదేశాల‌పై సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ స్పందిస్తూ.. అక్బ‌ర్ లోన్ మంగ‌ళ‌వారానిక‌ల్లా అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు. ఒకవేళ అలా చేయకపోతే తాను ఆయన తరఫున కేసు వాదించబోనని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపారు.

ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నంలో చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌తో పాటు స‌భ్యులుగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు గాను అక్బర్ లోన్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందని తెలిపారు. మన రాజ్యాంగానికి విధేయుడిననే విషయాన్ని కూడా ఆయన ప్రకటించాల్సి ఉందని చెప్పారు.

ఈ నెల ఒకటో తేదీన కశ్మీరీ పండిట్లకు చెందిన 'రూట్స్ ఇన్ కశ్మీర్' సంస్థ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌లో.. అక్బర్ లోన్ పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాదుల మద్దతుదారని ఆరోపించింది. అతని విశ్వసనీయతపై సందేహాలు లేవ‌నెత్తింది.

*

First Published:  5 Sept 2023 8:32 AM IST
Next Story