కేజ్రీవాల్ సర్కార్‌కు సుప్రీంలో భారీ విజయం - ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన వైనం
శాంతిభద్రతలు మినహా మిగిలిన అన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన అధికారాలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉండాలని స్పష్టం చేసింది.
ఢిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించి శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా లేక ఆ రాష్ట్ర ప్రభుత్వానిదా అనే వివాదంపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా గురువారం తీర్పు చెప్పింది. ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు చెప్పడం గమనార్హం.
అంతేకాదు.. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగిలిన అన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన అధికారాలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉండాలని స్పష్టం చేసింది.
ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసులపై కేంద్రానికే నియంత్రణ ఉంటుందని కేంద్ర హోం శాఖ 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దీనిని సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ తమకు అనుకూలంగా ఫలితం రాకపోవడంతో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం ఐదుగురు సభ్యుల ధర్మాసనం పై తీర్పు వెలువరించింది.