Telugu Global
National

ఉచిత హామీలను కట్టడి చేయాలి: సుప్రీంకోర్టు

ఈ ఉచితాల విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా అని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా, ఈ ఉచితాలను రాజకీయంగా కట్టడి చేయడం చాలా కష్టమని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు.

ఉచిత హామీలను కట్టడి చేయాలి: సుప్రీంకోర్టు
X

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా ఉచిత హామీలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ హామీలపై రాజకీయ పార్టీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత హామీల కట్టడిపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని మంగళవారం అత్యున్నత న్యాయ‌స్థానం ఆదేశించింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని.. ఈ విషయంలో ఫైనాన్స్ కమిషన్ సలహాలను తీసుకోవచ్చా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు అడిగింది.

అశ్విని ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఈ ఉచిత పథకాల హామీలను కట్టడి చేయాలని వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ ఉచితాల విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా అని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా, ఈ ఉచితాలను రాజకీయంగా కట్టడి చేయడం చాలా కష్టమని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు నిధులను కేటాయించే సమయంలో ఈ ఉచితాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని.. ఉచిత పథకాలకు నిధులను తగ్గిస్తే రాజకీయ పార్టీలు కూడా హామీలు ఇవ్వడం తగ్గిస్తుందని కపిల్ సిబాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కాగా, ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. ఉచిత హామీలను నియంత్రించే అధికారం తమకు లేనది స్పష్టం చేసింది. ఉచిత పథకాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుందో ఓటర్లే ఒక అంచనాలకు వచ్చి ఎన్నికల్లో ఓటేస్తే మంచిదని కోర్టు దృష్టికి తెచ్చింది. అయితే ఈ సమస్యను కేవలం ఎన్నికల కమిషన్ మాత్రమే పరిష్కరించగలదని కేంద్ర ప్రభుత్వ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ తెలియజేయడం విశేషం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉచితాల వల్ల ఇప్పటికే రూ.6.5 లక్షల కోట్లకు అప్పు చేరింద‌ని న్యాయస్థానం దృష్టికి అశ్విని ఉపాధ్యాయ్ తీసుకొచ్చారు. ఇది ఇలా కొనసాగితే మరో శ్రీలంకలా పరిస్థితి మారిపోతుందని తెలిపారు. కాగా, ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ, అగస్టు 3కు విచారణను వాయిదా వేసింది.

First Published:  26 July 2022 5:24 PM IST
Next Story