Telugu Global
National

మోడీని విమర్శిస్తే దాడి లేదా జైలు.. దేశానికిది చెడు కాలం - జస్టిస్ శ్రీకృష్ణ

''నేను ఒక కూడలిలో నిలబడి ప్రధాని నరేంద్రమోడీ ముఖం నచ్చలేదు అని చెబితే.. వెంటనే ఎవరైనా నాపై దాడి చేయవచ్చు. నన్ను అరెస్ట్ కూడా చేయవచ్చు. ఎలాంటి కారణం చూపకుండానే జైల్లో పడేయవచ్చు. దేశానికి ఇది చెడు కాలం '' అంటూ జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు.

మోడీని విమర్శిస్తే దాడి లేదా జైలు.. దేశానికిది చెడు కాలం - జస్టిస్ శ్రీకృష్ణ
X

దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్‌ శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ( గతంలో తెలుగు రాష్ట్రాల విభజన ఉద్యమ సమయంలో ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీకి నాయకత్వం వహించింది బీఎన్‌ శ్రీకృష్ణనే).

ద హిందూ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేశంలో పరిస్థితులు చాలా చెడ్డగా మారాయని శ్రీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ''నేను ఒక కూడలిలో నిలబడి ప్రధాని నరేంద్రమోడీ ముఖం నచ్చలేదు అని చెబితే.. వెంటనే ఎవరైనా నాపై దాడి చేయవచ్చు. నన్ను అరెస్ట్ కూడా చేయవచ్చు. ఎలాంటి కారణం చూపకుండానే జైల్లో పడేయవచ్చు. దేశానికి ఇది చెడు కాలం '' అంటూ జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రధానిని ఎవరు విమర్శించినా జైలుపాలయ్యే పరిస్థితులు దేశంలో దాపురించాయని... మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

బీఎన్ శ్రీకృష్ణ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ప్రముఖంగా ప్రస్తావించింది. శ్రీకృష్ణ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాజీ హోంమంత్రి చిదంబరం ట్వీట్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా మన దేశంలో పరిస్థితి ఎలా ఉందో శ్రీకృష్ణ వ్యాఖ్యలే నిదర్శనం అంటూ చిదంబరం కామెంట్ చేశారు.

వెంటనే శ్రీకృష్ణపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు ఫైర్ అయ్యారు. ప్రజాద‌రణతో ఎన్నికైన ప్రధానిని ఎలాంటి హద్దులు లేకుండా అన్నివేళల దూషించేవారు వాక్‌ స్వాతంత్య్రం గురించి కంగారు పడుతున్నారని రిజిజు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీపై మాత్రం ఇలాంటి వారు నోరెత్తరు, ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను విమర్శించే ధైర్యమూ చేయరు అంటూ న్యాయశాఖ మంత్రి విమర్శించారు.

అసలు ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తేనా అన్న అనుమానం కలుగుతోందని.. ఒకవేళ ఆయన మాజీ న్యాయమూర్తే అయి ఉంటే... ఇది వరకు చేపట్టిన పదవికి గౌరవాన్ని తగ్గించేలా ఆయన వ్యాఖ్యలున్నాయంటూ రిజిజు వ్యాఖ్యానించారు.

First Published:  5 Sept 2022 11:11 AM IST
Next Story