Telugu Global
National

ఎలక్టోరల్‌ బాండ్స్‌.. SBIకి షాకిచ్చిన సుప్రీం

రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్‌ బాండ్స్ స్కీంను రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల ప్రకటించింది సుప్రీంకోర్టు.

ఎలక్టోరల్‌ బాండ్స్‌.. SBIకి షాకిచ్చిన సుప్రీం
X

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. బాండ్ల వివరాలు వెల్లడించేందుకు జూన్‌ 30 వరకు గడువు పొడిగించాలన్న SBI విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 26 రోజుల పాటు ఏం చేశారని SBIని ప్రశ్నించింది. సీల్డ్ కవర్ తెరిచి వివరాలు ఈసీకి ఇస్తే చాలని SBIకి సూచించింది. రేపటిలోగా అంటే మంగళవారం నాటికి ఈసీకి వివరాలు ఇవ్వాల్సిందేనని.. ఆ వివరాలను ఈసీ మార్చి 15 నాటికి తన వెబ్‌సైట్‌లో పబ్లిష్‌ చేయాలని ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్‌ బాండ్స్ స్కీంను రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల ప్రకటించింది సుప్రీంకోర్టు. ఏప్రిల్‌ 12, 2019 నుంచి బాండ్స్‌కు సంబంధించిన వివరాలను మార్చి 6 నాటికి ఈసీకి ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను మార్చి 13 నాటికి ఈసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిష్‌ చేయాలని స్పష్టం చేసింది. కానీ చివరి నిమిషంలో మార్చి 4న ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు సమర్పించేందుకు గడువు పొడిగించాలనికోరుతూ SBI సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.


తాజాగా ఈ పిటిషన్‌పై విచారించిన చీఫ్‌ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం SBIపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయంలో గడువు పొడిగించాలని కోరడం చాలా సీరియస్‌ అంశంగా అభివర్ణించింది. ఈ విషయంలో తీర్పు, ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపింది. SBI తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే.. ఆ వివరాలు సేకరించేందుకు సమయం పడుతుందని.. అందుకే గడువు కోరినట్లు వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న సీజేఐ.. వివరాలను సీల్డ్ కవర్‌లో పెట్టి ముంబై బ్రాంచ్‌కు ఇచ్చామని మీరే చెప్పారని.. ఆ వివరాలను మ్యాచ్‌ చేసి ఇవ్వాలని తాము చెప్పలేదని.. దాతలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని SBIని ఆదేశించామన్నారు. సుప్రీం ఆదేశాలను ఎందుకు పాటించలేదో చెప్పాలన్నారు సీజేఐ. సీల్డ్‌ కవర్‌లో వివరాలు ఉంటే.. ఆ కవర్‌ను ఓపెన్‌ చేసి వివరాలు ఇవ్వొచ్చు కదా అని ప్ర‌శ్నించారు.

జూన్‌ 30 వరకు సమయం కావాలని SBI చేసిన విజ్ఞప్తికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకు డోనర్స్ పేరును బయటపెట్టకూడదన్న ఉద్దేశంతోనే SBI ఆ వివరాలను దాచిపెడుతోందని పిటిషనర్ ఆరోపించారు.

అసలేంటి వివాదం..!

ఏ వ్యక్తి అయినా లేదా ఏ సంస్థ అయినా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలని అనుకుంటే.. SBI దగ్గరకు వెళ్లి ఎలక్టోరల్ బాండ్స్ కొనాల్సి వచ్చేది. ఇందులో డోనర్ పేరును సీక్రెట్‌గా ఉంచేవారు. ఎవరు ఇచ్చారు.. అన్న విషయం రహస్యంగా ఉంటుందని కేంద్రం చెబుతూ వచ్చింది. కానీ డోనర్స్ వివరాలను పూర్తిగా ట్రేస్‌ చేయొచ్చని.. ఎలక్టోరల్ బాండ్స్ స్కీంలో చాలా లోపాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని సుదీర్ఘకాలం పాటు విచారించిన సుప్రీంకోర్టు.. ఇటీవల ఎలక్టోరల్ బాండ్స్‌ స్కీంను రద్దు చేసింది.

First Published:  11 March 2024 8:19 AM GMT
Next Story