సుకేశ్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు.. - లాయర్లతో భేటీ గడువు పెంచాలన్న అభ్యర్థనకు ధర్మాసనం నో
సుకేశ్ అభ్యర్థనపై విచారణ సందర్భంగా ఆయన తరఫున న్యాయవాది ఆయనకున్న కేసులు.. వాటిని చూస్తున్న లాయర్ల విషయం న్యాయస్థానానికి తెలియజేశారు.
మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఇప్పుడు జైలులో ఉన్న విషయం తెలిసిందే. మనీ ల్యాండరింగ్‌తో పాటు పలువురిని మోసగించాడనేది అతనిపై ఆరోపణ. అతనిపై ఆరు నగరాల్లో 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 10 మందికి పైగా న్యాయవాదులు ఆయా కేసులను వాదిస్తున్నారు. ఈ కేసుల విషయమై తన లాయర్లతో మాట్లాడే సమయం తనకు సరిపోవడం లేదని, లాయర్లతో భేటీ సమయాన్ని పొడిగించాలని అతను సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మంగళవారం అతని అభ్యర్థనను తోసిపుచ్చింది.
సుకేశ్ అభ్యర్థనపై విచారణ సందర్భంగా ఆయన తరఫున న్యాయవాది ఆయనకున్న కేసులు.. వాటిని చూస్తున్న లాయర్ల విషయం న్యాయస్థానానికి తెలియజేశారు. జైలు నిబంధనల మేరకు సుకేశ్‌కు ఇప్పటికే లాయర్లతో భేటీకి అవకాశం లభిస్తోందని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం గుర్తుచేసింది. అంతేకాదు.. ఈ సందర్భంగా సుకేశ్‌కి చురకలంటించింది. జైలు నిబంధనల ప్రకారం న్యాయవాదులను కలిసేందుకు వారానికి రెండుసార్లు 30 నిమిషాలు మాత్రమే అనుమతి ఇస్తున్నారని, ఇది సరిపోదని వాదించారు. ఇది తన క్లయింట్ హక్కులను హరిస్తోందని తెలిపారు.
దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. మీకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కావాలా అంటూ ప్రశ్నించింది. మీ లాయర్ల పేర్లు చెప్పండి.. వారిని కూడా జైలులోనే ఉంచేలా అనుమతించాలని జైలు అధికారులను అడుగుతాం అని చురకలంటించింది. అసాధారణ ఉపశమనం కోసం పిటిషన్ దారు అభ్యర్థించారని, దీనికి అనుమతించబోమని ధర్మాసనం వెల్లడించింది.