Telugu Global
National

ఎన్నికల బాండ్లపై వివరాలన్నీ ఇవ్వాల్సిందే .. - ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన ప్రతి సమాచారమూ బయటికి రావాలని తేల్చిచెప్పింది.

ఎన్నికల బాండ్లపై వివరాలన్నీ ఇవ్వాల్సిందే .. - ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం
X

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై మండిపడింది. తమ ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల నంబర్లు ఇవ్వకపోవడంపై నిలదీసింది. నంబర్లు సహా అన్ని వివరాలూ ఈసీ (ఎన్నికల కమిషన్‌)కి ఇచ్చి మార్చి 21 లోగా తమకు ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది.

ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన స్టేట్‌బ్యాంకు.. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన ప్రతి సమాచారమూ బయటికి రావాలని తేల్చిచెప్పింది. దేనినీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలూ ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు చెప్పిందని స్పష్టం చేశారు. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్‌ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బీఐ ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావులేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే వివరాలు అందిన వెంటనే వాటిని ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని న్యాయస్థానం తెలిపింది.

First Published:  18 March 2024 3:26 PM IST
Next Story