Telugu Global
National

బిల్కిస్ బానో రేపిస్టులకు క్షమాభిక్ష రద్దు

బాధితురాలు మరోమారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ నాగ‌ర‌త్న.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు.

బిల్కిస్ బానో రేపిస్టులకు క్షమాభిక్ష రద్దు
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. రేప్ కేసులో రిలీజైన 11 మంది నిందితుల క్ష‌మాభిక్ష‌ను ర‌ద్దు చేసింది. రేపిస్టుల‌ను ముంద‌స్తుగా రిలీజ్ చేయాల‌న్న తీర్పుని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. గుజ‌రాత్ స‌ర్కార్ ఇచ్చిన క్ష‌మాభిక్ష‌ను కోర్టు ర‌ద్దు చేసింది. ఆ నిందితులంద‌రూ రెండు వారాల్లోగా మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సిందే అని సుప్రీంకోర్టు ఇవాళ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. జ‌స్టిస్ బీవీ నాగ‌ర్న‌త‌, ఉజ్వ‌ల్ భూయాన్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువ‌రించింది. రేప్ నిందితుల‌కు క్ష‌మాభిక్ష పెట్టే అర్హ‌త గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి లేద‌ని, ఆ కేసులో అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం మ‌హారాష్ట్ర స‌ర్కారుకు ఉంద‌ని, ఎందుకంటే అక్కడే ఆ కేసులో విచార‌ణ జ‌రిగింద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.


కేసు వివరాలలోకి వెళితే..

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. బానో ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ దారుణంగా చంపేశారు. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. ఈ దారుణంపై బిల్కిస్ బానో సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశారు. నిందితుల అరెస్టు మొదలుకొని వారికి శిక్ష పడేంత వరకూ పోరాడారు. నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది.


అయితే దీనిపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షకు మార్చింది. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. 1992 చట్టం ప్రకారం.. వీరు 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకోవడంతో పాటు జైలులో సత్ప్రవర్తనతో మెలిగారని మెచ్చుకుని, స్వాతంత్ర దినోత్సవం రోజు విడుద‌ల చేసింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అత్యంత దారుణానికి పాల్పడిన వారిని స్వేచ్ఛాయుత సమాజంలో విడిచి పెట్టడటంపై పలువురు ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బాధితురాలు మరోమారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ నాగ‌ర‌త్న.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ అధికారాల‌ను గుజ‌రాత్ అప‌హ‌రించిన‌ట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో త్వరలోనే వారు పోలీసులు లేదా న్యాయస్థానం ముందు సరెండర్ అయ్యే అవకాశాలున్నాయి.

First Published:  8 Jan 2024 7:30 AM GMT
Next Story