Telugu Global
National

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని పిటిషన్.. విచారణకు నో చెప్పిన సుప్రీం

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని పిటిషన్..  విచారణకు నో చెప్పిన సుప్రీం
X

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. దీనిపై ఇప్పటికే పలువురు ప్రభుత్వాలకు వినతులు చేశారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు గతంలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గో సంరక్షణ హిందువుల ప్రాథమిక హక్కు అని, ఆవును గౌరవించడం, రక్షించడం భారతజాతి విధి అని వ్యాఖ్యానించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ హైకోర్టు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

కాగా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇటువంటి పిటిషన్లు ఎందుకు వేస్తారంటూ పిటిషన్ దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గోవంశ్ సేవా సదన్ తో పాటు పలువురు ఒక పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై ఇవాళ జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగిందని మీరు ఈ పిటిషన్ వేశారని కోర్టు పిటిషన్ దారులను ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు ఎందుకు దాఖలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు కోర్టుకు వచ్చినందువల్ల మేము చట్టాన్ని గాలికి విసిరి వేయాలా? అని పిటిషన్ దారులను ధర్మాసనం ప్రశ్నించింది. గో సంరక్షణ చాలా ముఖ్యమని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించగా.. ఇది కోర్టు పని కాదని న్యాయవాదిని ధర్మాసనం హెచ్చరించింది. ఈ పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

First Published:  10 Oct 2022 10:07 PM IST
Next Story