Telugu Global
National

ఈ దశలో అది సాధ్యం కాదు.. - బూత్‌ల వారీ ఓటింగ్‌ శాతంపై సుప్రీంకోర్టు

ఇలాంటి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలంటే ఎన్నికల సంఘం వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని, ఇప్పుడు ఎన్నికల మధ్యలో అది సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది.

ఈ దశలో అది సాధ్యం కాదు.. - బూత్‌ల వారీ ఓటింగ్‌ శాతంపై సుప్రీంకోర్టు
X

పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటింగ్‌ శాతాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం ఇప్పుడు సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనిపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) తమ పిటిషన్‌ ద్వారా చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఐదు దశల పోలింగ్‌ పూర్తయ్యిందని, మరో రెండు దశల పోలింగ్‌ జరగాల్సి ఉందని, ఇలాంటి సమయంలో పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటింగ్‌ శాతాన్ని బహిర్గతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని తేల్చిచెప్పింది.

ఇలాంటి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలంటే ఎన్నికల సంఘం వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని, ఇప్పుడు ఎన్నికల మధ్యలో అది సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఎన్నికల సంఘంపై అదనపు భారం మోపడం సరైంది కాదని పేర్కొంది. ఏడీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత రెగ్యులర్‌ బెంచ్‌ విచారిస్తుందని వెల్లడించింది. ఇదే అంశంపై 2019 నుంచి పెండింగ్‌ లో ఉన్న ప్రధాన రిట్‌ పిటిషన్‌తో కలిపి తాజా పిటిషన్‌ను విచారించనున్నట్టు తెలిపింది.

First Published:  25 May 2024 9:26 AM IST
Next Story