ఇకపై సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం..
సుప్రీంకోర్టులో కేసుల విచారణ పర్వాన్ని కూడా నేరుగా ప్రజలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ఈ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది.
సుప్రీంకోర్టు విచారణలు ఇక నాలుగు గోడలకే పరిమితం కావు. విచారణ పర్వాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్ చేస్తారు. కొన్ని రోజుల పాటు యూట్యూబ్ ద్వారా విచారణలను లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీంకోర్టు సొంత ప్లాట్ ఫామ్ తయారు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయా ఛానెళ్ల ద్వారా లైవ్ టెలికాస్టింగ్‌ను అందరూ వీక్షించవచ్చు.
సుప్రీంకోర్టు తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు 2018లోనే నిర్ణయం తీసుకున్నా అది అమలు కాలేదు. ఆ తర్వాత ప్రత్యక్ష ప్రసారాల కోసం సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో సుప్రీం సానుకూలంగా స్పందించింది. ఆ ఉత్తర్వుల అమలులో మాత్రం తీవ్ర జాప్యం జరిగింది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వెబ్ క్యాస్టింగ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కేసుల విచారణ పర్వాన్ని కూడా నేరుగా ప్రజలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ఈ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది.
సెప్టెంబర్ 27 నుంచి ప్రత్యక్ష ప్రసారం అమలులోకి వస్తే.. పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించినట్టే. చీఫ్ జస్టిస్ లలిత్ అధ్యక్షతన జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విచారణలో మరింత పారదర్శకత పెరిగేందుకు, విచారణలో అసలేం జరుగుతుందనే విషయం ప్రజలు తెలిసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.