Telugu Global
National

బెయిల్‌ మంజూరుపై దిగువ కోర్టులకు సీజేఐ కీలక సూచనలు

ఒక నేరానికి సంబంధించి క్షేత్రస్థాయి నిజాలు దిగువ కోర్టు న్యాయమూర్తులకు బాగా తెలిసే ఉంటాయని.. కాబట్టి వాటి ఆధారంగా బెయిల్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని, విమర్శలు వస్తాయన్న ఆందోళన వదిలిపెట్టాలని సూచించారు.

బెయిల్‌ మంజూరుపై దిగువ కోర్టులకు సీజేఐ కీలక సూచనలు
X

బెయిల్‌ మంజూరు విషయంలో దిగువ కోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ కీలక సూచనలు చేశారు. నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ మంజూరు చేస్తే సమాజం నుంచి విమర్శలు వస్తాయన్న భయంతో బెయిల్ ఇచ్చేందుకు జిల్లా కోర్టు న్యాయమూర్తులు భయపడుతున్నారని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఒక నేరానికి సంబంధించి క్షేత్రస్థాయి నిజాలు దిగువ కోర్టు న్యాయమూర్తులకు బాగా తెలిసే ఉంటాయని.. కాబట్టి వాటి ఆధారంగా బెయిల్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని, విమర్శలు వస్తాయన్న ఆందోళన వదిలిపెట్టాలని సూచించారు. జిల్లా జడ్జిలకు తమ సొంత సామర్థ్యం మీద పూర్తి నమ్మకం లేనప్పుడే బెయిల్‌ ఇచ్చే విషయంలో నిర్ణయాలు తీసుకోలేకపోతారని వ్యాఖ్యానించారు.

నేరం ఎంతటి ఘోరమైనది అయినప్పటికీ అక్కడి నిజానిజాలపై న్యాయమూర్తులకు, లాయర్లకు ఒక స్పష్టత వచ్చి ఉంటుందన్నారు. ఘోరమైన కేసుల్లో బెయిల్ ఇచ్చే విషయంలో విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆ నేరంలో తప్పు చేయని వారిని కూడా లాగి ఉండవచ్చని.. అలాంటి పరిస్థితి ఉందనిపిస్తే బెయిల్ మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయలేదు అన్నది బెయిల్ మంజూరు సమయంలో బేరీజు వేసుకునే సామర్థ్యం న్యాయమూర్తులకు ఉండాలన్నారు.

న్యాయమూర్తులకు ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ ఘోరమైన నేరాల్లో బెయిల్ ఇస్తే ఆరోపణలు వస్తాయన్న భయంతోనూ ఆ పనిచేయడం లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు. బెయిల్ మంజూరు విషయంలో దిగువ కోర్టులు సరిగా వ్యవహరించకపోతే ఆ భారమంతా పైకోర్టులపై పడుతుందని గుర్తు చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  20 Nov 2022 7:39 AM IST
Next Story