సుప్రీం కోర్టు పై ఆరెస్సెస్ దాడి... దేశ వ్యతిరేక శక్తులకు పని ముట్టుగా ఉపయోగపడుతోందని ఆరోపణ
బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: మోడీ క్వశ్చన్’ను షేర్ చేస్తున్న సోషల్ మీడియా లింక్‌లను తొలగించాలన్న కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసినందుకు విమర్శిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక పాంచజన్య సుప్రీంకోర్టును భారత వ్యతిరేకులు ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడింది.
మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆరెస్సెస్ కు కోపమొస్తుంది. మోడిపై విమర్శలు చేసేవారందరూ దేశవ్యతిరేకులు అన్న బీజేపీ ప్రచారంలో ఆరెస్సెస్ కూడా గొంతు కలుపుతోంది.
గుజరాత్ మత అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ సృష్టించిన సంచలనం అటు బీజేపీకే కాదు ఆరెస్సెస్ కు కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించడం ప్రజాస్వామ్యానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్చకు వ్యతిరేకం అన్న వాదనలను బీజేపీయే కాకుండా ఆరెస్సెస్ కూడా ఖండిస్తోంది. నిషేధంపై సుప్రీం కోర్టు విచారణ జరపడం ఆరెస్సెస్ భరించలేకపోతోంది. దాంతో సుప్రీం కోర్టు దేశ వ్యతిరేకులకు పనిముట్టుగా ఉపయోగపడుతోందనే వాదనలను అందుకుంది.
బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: మోడీ క్వశ్చన్’ను షేర్ చేస్తున్న సోషల్ మీడియా లింక్‌లను తొలగించాలన్న కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసినందుకు విమర్శిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక పాంచజన్య సుప్రీంకోర్టును భారత వ్యతిరేకులు ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడింది.
బిబిసి డాక్యుమెంటరీ అవాస్తవం, ఊహ ఆధారంగా రూపొందించబడిందని ,భారతదేశం పరువు తీసేందుకు చేస్తున్న ప్రయత్నమని పాంచజన్య సంపాదకీయం ఆరోపించింది.
ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కేంద్రానికి జారీ చేసిన నోటీసును ప్రస్తావిస్తూ, పాంచజన్య సంపాదకీయంలో “సుప్రీం కోర్ట్ భారతదేశానికి చెందినది, ఇది భారతీయులు చెల్లించే పన్నుల ద్వారా నడుస్తుంది; దాని పని భారతదేశం కోసం రూపొందించిన చట్టాల ప్రకారం పనిచేయడం. అందుకోసమే మేము సుప్రీం కోర్ట్ ను సృష్టించాము. అందుకోసమే దానిని నిర్వహిస్తున్నాము. కానీ ఇప్పుడది భారతదేశాన్ని వ్యతిరేకించే వారికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది.'' అని పాంచజన్య సంపాదకీయం ఆరోపించింది.
మానవ హక్కుల పేరిట ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం, పర్యావరణం పేరిట భారతదేశ ప్రగతికి ఆటంకాలు సృష్టిస్తున్నారని సంపాదకీయం పేర్కొంది, “దేశవ్యతిరేకులు భారతదేశ ప్రజాస్వామ్యం, ఉదారవాదం, నాగరికత ప్రమాణాలను తమ కోసం ఉపయోగించుకుంటున్నారు.'' అని పాంచజన్య విమర్శించింది.
''ఇక వారి తదుపరి దశ.. దేశంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే హక్కు దేశ వ్యతిరేక శక్తులకు ఉండేలా చూడడం; మత మార్పిడి ద్వారా దేశాన్ని బలహీనపరిచే హక్కు ఉండాలా చూడటం. అంతే కాదు, ఈ హక్కులను వినియోగించుకోవడానికి, వారు భారత చట్టాల రక్షణను పొందాలని ప్రయత్నిస్తారు. ఇదే దేశవ్యతిరేకుల ఎజెండా. ''అని ఆరెస్సెస్ పత్రిక పేర్కొంది.