Telugu Global
National

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
X

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాదు రుతుక్రమ సెలవులు మంజూరు చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపి మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే బిహార్‌లో నెలకు రెండు రోజు సెలవు ఇస్తుండగా, కేరళలోనూ నెలకు మూడు రోజుల పాటు విద్యార్థినులకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యం మిగతా రాష్ట్రాల్లోనూ దీన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

రుతుక్రమ సెలవులు మంజూరు చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. కొన్నిసార్లు మహిళల ప్రయోజనాల కోసం మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదంది. అంతేగాక.. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం విస్తృత చర్చలు జరిపి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

First Published:  8 July 2024 11:48 AM GMT
Next Story