రక్షణ శాఖ తీరుపై మండిపడ్డ సుప్రీంకోర్టు - పింఛను బకాయిలపై ప్రకటనకు చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ఒకే ర్యాంక్ - ఒకే పింఛన్ కింద సాయుధ బలగాల్లో అర్హత కలిగిన పింఛనుదారులందరి బకాయిలు చెల్లించాలంటూ జనవరి 9న జరిగిన విచారణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీని అందుకు గడువుగా విధించింది. అయితే వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామని రక్షణ శాఖ చేసిన ప్రకటన సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించింది.
రక్షణ శాఖ తీరుపై దేశ అత్యున్నత ధర్మాసనం మండిపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల రక్షణ శాఖ కార్యదర్శి విడుదల చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే ధిక్కరణ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించింది.
ఒకే ర్యాంక్ - ఒకే పింఛన్ కింద సాయుధ బలగాల్లో అర్హత కలిగిన పింఛనుదారులందరి బకాయిలు చెల్లించాలంటూ జనవరి 9న జరిగిన విచారణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీని అందుకు గడువుగా విధించింది. అయితే జనవరి 20న రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. బకాయిలను ఏడాదికోసారి చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొంది.
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకటన విడుదల చేసిన రక్షణ శాఖ కార్యదర్శిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రకటన విడుదల చేసినందుకు మీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని చెప్పండి.. న్యాయ ప్రక్రియ పవిత్రతను కాపాడాలి.. లేదంటే రక్షణ మంత్రిత్వ శాఖకు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తాం.. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు మీకు లేదు.. మార్చి 15 వరకు పొడిగింపు ఇస్తే... వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామని ప్రకటన ఎలా ఇస్తారంటూ మండిపడింది. ఆ అధికారం మీకు లేదని స్పష్టం చేసింది. ఇక్కడ మీరు చట్టానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం లేదు.. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి.. రక్షణ మంత్రిత్వ శాఖ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు.. కార్యదర్శి ఈ విషయంపై ప్రమాణ పత్రం దాఖలు చేయాలి.. ఏ పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారో వెల్లడించాలి.. అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.