Telugu Global
National

సాక్షులకు తర్ఫీదుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌.. విచారణ సందర్భంగా సాక్షులు తర్ఫీదు పొంది వచ్చినట్టు గుర్తించారు.

సాక్షులకు తర్ఫీదుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

ఒక హత్య కేసులో సాక్షులకు పోలీసులే తర్ఫీదు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ సందర్భంగా ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి.. ఎలా వ్యవహరించాలనే విషయాలను ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే తర్ఫీదు ఇవ్వడం వంటి చర్యలు దిగ్భ్రాంతికరమని, అది కూడా ఏకంగా పోలీసు అధికారులే ఈ చర్యకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది. ఒక కేసు విషయంలో పోలీసులు తమకు కావలసిన విధంగా సాక్షులకు తర్ఫీదు ఇచ్చిన విషయాన్ని ట్రయల్‌ కోర్టు, హైకోర్టు గుర్తించలేకపోవడం విస్మయపరిచిందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.

2007 అక్టోబరు 4న బాలమురుగన్‌ అనే వ్యక్తిని మణికందన్, శివకుమార్‌ హత్య చేశారంటూ కేసు నమోదైంది. బాలమురుగన్‌ ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కేసు విచారించిన దిగువ న్యాయస్థానాలు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించాయి. ఈ నేపథ్యంలో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌.. విచారణ సందర్భంగా సాక్షులు తర్ఫీదు పొంది వచ్చినట్టు గుర్తించారు. పోలీసులు చెప్పినట్టు కోర్టులో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఖరారు చేసుకున్న న్యాయమూర్తులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించారు. హత్య కేసులో ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించిన దిగువ న్యాయస్థానాల తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పోలీసులు తమకు కావలసిన విధంగా సాక్షులకు తర్ఫీదునిచ్చిన విషయాన్ని ట్రయల్‌ కోర్టు, హైకోర్టు గుర్తించలేకపోవడం విస్మయపరిచిందని పేర్కొంది. కోర్టులో ఎలా చెప్పాలో ముందుగానే సాక్షులకు పోలీసులు శిక్షణ ఇవ్వడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడింది. అటువంటి సాక్షా్యలు చెల్లబోమని స్పష్టం చేసింది. అసలైన సాక్షులను వదిలేసి, పోలీసులు సిద్ధం చేసిన వారిని కోర్టులో ప్రశ్నించారని పేర్కొంది.

First Published:  6 April 2024 10:48 AM IST
Next Story