Telugu Global
National

ఆ నేరాల్లో శిక్షలు పడితే, నేతలపై జీవితకాల నిషేధం

ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు ఎన్ని కేసులు విచారణ ముగించాయనే దానిపై నెలవారీ నివేదికలు సమర్పించేలా హైకోర్టులు చూడాలని తన నివేదికలో పేర్కొన్నారు.

ఆ నేరాల్లో శిక్షలు పడితే, నేతలపై జీవితకాల నిషేధం
X

క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్దారణ అయిన సాధారణ ప్రభుత్వ ఉద్యోగులను కూడా సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తారని, కానీ రాజకీయ నాయకుల విషయంలో ఆరేళ్ల పాటు నిషేధంతో సరిపెట్టేయటం సరికదాని సుప్రీం కోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తెలియజేశారు.

అత్యాచారం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతల విషయంలో కఠినంగా వ్యహరించాలని సూచించారు. నైతికపరమైన అంశాలు ఇమిడి ఉన్న కేసుల్లో శిక్షపడిన చట్టసభ సభ్యులను జీవితాంతం ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని సుప్రీంకోర్టుకు ఓ నివేదిక సమర్పించారు.

ప్రజాప్రతినిధులుపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణను త్వరితగతిన నిర్వహించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హన్సారియా అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ పిటిషన్‌ సుప్రీకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన 19వ నివేదికను సమర్పించారు.

ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు ఎన్ని కేసులు విచారణ ముగించాయనే దానిపై నెలవారీ నివేదికలు సమర్పించేలా హైకోర్టులు చూడాలని తన నివేదికలో పేర్కొన్నారు.

అలాగే ప్రతి జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి లకు ఈ ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను కేటాయించేటప్పుడు ఇప్పటికే ప్రత్యేక కోర్టు ఎదుట ఉన్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలపై ప్రత్యేకంగా తమ వెబ్‌సైట్‌లో హైకోర్టులు ప్రస్తావించాలని చెప్పారు.

దేశవ్యాప్తంగా 2022 నవంబర్ నాటికి ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్య 5175. ఇందులో ఐదేళ్ల పైబడి విచారణలో ఉన్న కేసులు 2116. వీటిలో అత్యధిక కేసులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవి కాగా బీహార్ 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 92 కేసులు పెండింగ్‌లో ఉండగా, తెలంగాణలో 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

First Published:  15 Sept 2023 5:15 AM IST
Next Story