Telugu Global
National

నొప్పి, బాధ తక్కువగా.. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పండి.. ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచన

ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పి, బాధతో మరణం సంభవించే ఇతర మార్గాల‌ను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. నిపుణులతో సంప్రదించి సాధ్యాసాధ్యాలపై సమాచారం సేకరించాలని సూచనలు చేసింది.

నొప్పి, బాధ తక్కువగా.. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పండి.. ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచన
X

మనదేశంలో తీవ్ర నేరాలకు విధించే కఠిన శిక్ష ఉరిశిక్ష. కొన్ని ఇస్లాం దేశాల్లో మరణ శిక్ష అంటే తీవ్ర నొప్పి, బాధతో కూడినదిగా ఉంటుంది. కొన్ని దేశాలు తీవ్ర నేరాలకు పాల్పడేవారి కాళ్లు, చేతులు ప్రజల సమక్షంలోనే అత్యంత కిరాతకంగా తొలగిస్తుంటాయి. మరణ దండన కూడా అలాగే క్రూరంగా విధిస్తుంటాయి.

అయితే మన దేశంలో మాత్రం తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధిస్తున్నారు. అలాగే జీవిత ఖైదు, బతికి ఉన్నంతవరకు ఖైదు వంటి శిక్షలు విధిస్తున్నారు. దేశంలో ఉరిశిక్ష మొదట్లో అమల్లో ఉన్నప్పటికీ.. ఆ తర్వాతి కాలంలో ఉరిశిక్ష విధించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. నేరానికి పాల్పడ్డ వ్యక్తి తాను చేసింది తప్పు అని తెలుసుకుని మారితే చాలని, మరణ దండన ఘోరమన్న వాదనలు వినిపించాయి.

ఉరిశిక్ష రద్దు కోసం కొంతమంది పోరాటాలు కూడా చేపట్టారు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో దేశంలో సుదీర్ఘకాలం ఎవరికీ ఉరి శిక్షలు వేయలేదు. అయితే ఇటీవలి కాలంలో దేశంలో మళ్లీ కోర్టులు ఉరిశిక్షలు విధిస్తున్నాయి. ఘోరంగా హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న తరుణంలో కోర్టులు ఈ విధంగా శిక్షలు విధిస్తున్నాయి. ఉగ్రవాదం పెరగడం.. అందులో ప్రమేయం ఉన్నవారికి ఉరిశిక్ష విధించడం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని, ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పి, బాధతో మరణం సంభవించే ఇతర మార్గాల‌ను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. నిపుణులతో సంప్రదించి సాధ్యాసాధ్యాలపై సమాచారం సేకరించాలని సూచనలు చేసింది. ఉరిశిక్ష ప్రత్యామ్నాయ మార్గాలపై శాస్త్ర సాంకేతికతతో పాటు ఇతర కోణాల్లో పరిశీలించి అభిప్రాయాలు చెప్పేందుకు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్ కు చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇతర దేశాల్లో మరణ దండన ఏ విధంగా విధిస్తున్నారో పరిశీలన జరపాలని, ఇందుకు సంబంధించిన నివేదిక మే ఆఖరులోగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది.

First Published:  22 March 2023 2:57 PM IST
Next Story