సుప్రీంలో లలిత్‌మోదీకి ఊరట
లలిత్ మోదీ చెప్పిన క్షమాపణలను అంగీకరిస్తున్నామని తెలిపారు. ప్రతివాది భవిష్యత్తులో న్యాయ స్థానాలు, న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే.. తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టినందుకు సుప్రీంకోర్టులో కేసు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ఊరట లభించింది. ఈ వ్యవహారంలో లలిత్ మోదీ బేషరతు క్షమాపణ చెప్పడంతో ఈ కేసు విచారణను ధర్మాసనం సోమవారంతో ముగించింది.
లలిత్ మోదీ బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తూ న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను జస్టిస్ ఏఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన బెంచ్ సోమవారం పరిగణనలోకి తీసుకుంది. భవిష్యత్తులో తాను న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ గౌరవానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలకూ పాల్పడబోనని లలిత్ మోదీ తన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు దీనిపై మాట్లాడుతూ.. లలిత్ మోదీ చెప్పిన క్షమాపణలను అంగీకరిస్తున్నామని తెలిపారు. ప్రతివాది భవిష్యత్తులో న్యాయ స్థానాలు, న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే.. తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థను గౌరవించాలని ఈ సందర్భంగా న్యాయమూర్తులు తెలిపారు.