Telugu Global
National

అంత్యక్రియల కంపెనీ, ఏడాదికి 50లక్షల టర్నోవర్..

శవపేటిక దగ్గర్నుంచి శవాన్ని మోసేందుకు అవసరమైనవారిని కూడా వారే పంపిస్తారు. శవంపై పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చేవారు, అంతిమ సంస్కారం నిర్వహించే పూజారులు, పూలతో సహా పూజా సామగ్రి.. అన్నీ వీరే సమకూరుస్తారు.

అంత్యక్రియల కంపెనీ, ఏడాదికి 50లక్షల టర్నోవర్..
X

బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లు, రిసెప్షన్లు.. వీటిని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి. పెళ్లి మండపం, మంగళ వాయిద్యం, తోరణాలు, బంధువుల నుంచి.. అన్నిట్నీ సమకూర్చే సంస్థలున్నాయి. ఇలాగే పుట్టినరోజు ఫంక్షన్లు కూడా చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా అంత్యక్రియలకోసం కొన్ని స్టార్టప్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. శవాన్ని భద్రపరిచే ఫ్రీజర్ దగ్గర్నుంచి, అస్థికల్ని నదిలో కలపడం వరకు వీరు కాంట్రాక్ట్ తీసుకుంటారు. అద్దెకు ఏడ్చే మనుషుల్ని కూడా వీరు అరేంజ్ చేస్తారు. ఇలాంటి ఓ కంపెనీ ఇప్పుడు ఢిల్లీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో స్టాల్ ఏర్పాటు చేయడంతో దీనికి మరింత ప్రచారం వచ్చింది. సుఖాంత్ ఫ్యునరల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరిస్తోంది.

జీవితం సుఖాంతం..

సుఖంగా జీవించడమే కాదు, జీవితానంతరం కూడా సుఖమయమైన అంత్యక్రియల ఘట్టం కోసం ఈ సుఖాంత్ కంపెనీని సంప్రదిస్తున్నారు కొంతమంది. అంత్యక్రియల ఖర్చులకోసం రూ.38,500 ఆ కంపెనీకి జమ చేస్తే, ఆ తర్వాత కార్యక్రమాలన్నీ వారే నిర్వహిస్తారు. ఇది బేసిక్ ప్లాన్, వీటికి అదనంగా మరిన్ని ఖర్చులుంటాయి. వాటికి కూడా వారి ప్లాన్ ప్రకారం డబ్బులు వసూలు చేస్తుంటుంది సుఖాంత్ కంపెనీ.

ఏమేం చేస్తారు..?

శవపేటిక దగ్గర్నుంచి శవాన్ని మోసేందుకు అవసరమైనవారిని కూడా వారే పంపిస్తారు. శవంపై పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చేవారు, అంతిమ సంస్కారం నిర్వహించే పూజారులు, అంతిమ యాత్రలో పాల్గొని అమర్ రహే అనేవారు, పూలతో సహా పూజా సామగ్రి.. అన్నీ వీరే సమకూరుస్తారు.

టర్నోవర్ 50లక్షలు..

సుఖాంత్ స్టార్టప్ కంపెనీ ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ ఈ కంపెనీ తరపున 5వేల అంత్యక్రియలు నిర్వహించారు. ఏడాదికి 50లక్షల టర్నోవర్ సంపాదిస్తోంది ఈ కంపెనీ. ప్రస్తుతం ముంబై, థానేలో వీరి సేవలు విస్తరించాయి. ఢిల్లీ ట్రేడ్ ఫెయిర్ లో స్టాల్ ఏర్పాటు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాంచ్ లు ఓపెన్ చేస్తామని చెబుతున్నారు.

First Published:  22 Nov 2022 9:19 AM IST
Next Story