మన దేశంలో స్త్రీలతో పోలిస్తే పురుషుల ఆత్మహత్యలే అధికం.. ఎందుకంటే…
2021లో ఇండియాలో జరిగిన ఆత్మహత్యలపై ది లాన్సెట్ రీజినల్ హెల్త్ నివేదిక కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా ఈ నివేదిక వెల్లడైంది.
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చాలా ఆత్మహత్యలకు కారణాలు కూడా చాలా చిన్నవిగానే కనిపిస్తున్నాయి. 2021లో ఇండియాలో జరిగిన ఆత్మహత్యలపై ది లాన్సెట్ రీజినల్ హెల్త్ నివేదిక కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా ఈ నివేదిక వెల్లడైంది.
దీని ప్రకారం దేశంలో స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఆత్మహత్యల రేటు 13.1 శాతం ఎక్కువ. గత ఏడేళ్లలో భారతీయ పురుషుల ఆత్మహత్యల మరణాల కేసులు మూడింట ఒక వంతుకు పైగా పెరిగాయని ది లాన్సెట్ రీజినల్ హెల్త్ నివేదిక పేర్కొంది.
2014లో దేశంలో మొత్తం సుమారు 42 వేల మంది మహిళలు, 89 వేల మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే 2021లో ఈ నిష్పత్తి 2.64 రెట్లు పెరిగింది. 2021లో పురుషులు 1,20 వేల మంది ఆత్మహత్యకు పాల్పడితే.. స్త్రీలు 45 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో వివాహిత పురుషుల్లో ఆత్మహత్య మరణాల రేటు మూడు రెట్లు నమోదైంది. ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో ఎక్కువ మంది 30 నుంచి 44 ఏళ్ళ మధ్య ఉన్నవారే అని ఈ నివేదిక చెబుతోంది. వీరిలో రోజువారీ కూలీలే ఎక్కువ. వీరిలో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
లక్ష మరణాలకు పోల్చి చూసినప్పుడు పురుషుల ఆత్మహత్య రేటు 24.3 శాతం ఉంటే , స్త్రీలది 8.4 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది.
మహిళల ఆత్మహత్యలు తక్కువగా ఉండటానికి కోపింగ్ మెకానిజం కారణం కావచ్చని నివేదిక అంచనా వేసింది.
మొత్తం మీద ఈ నివేదిక ప్రకారం 2014 తో పోలిస్తే 2021లో పురుషుల ఆత్మహత్యల సంఖ్య 33.4 శాతం పెరిగింది.
♦