Telugu Global
National

రెండు పొరుగు రాష్ట్రాల మధ్య ఇంత వివ‌క్షా !

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా తిరస్కరించడం ఖచ్చితంగా వివక్షనే అనే విమర్షలు వస్తున్నాయి. పక్కనే ఉన్న కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా కల్పించి, కాళేశ్వరానికి ఇవ్వకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.

రెండు పొరుగు రాష్ట్రాల మధ్య ఇంత వివ‌క్షా !
X

ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వివక్షకు పరాకాష్ట. అదే తెలంగాణ పక్కనే ఉన్న కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా కల్పించింది. ఈ ప్రాజెక్టు వల్ల తుంగభద్రలోకి వచ్చే ప్రవాహం తగ్గిపోతుందని, శ్రీశైలం ప్రాజెక్టుపై దీని ప్రభావం తీవ్రంగా పడుతుందని, దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి లేఖ రాసినప్పటికీ ఖాతరు చేయని కేంద్రం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. 2018, 19 లో ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం 16,125. 48 కోట్ల రూపాయలు అందులో ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం 4,868.31కోట్ల రూపాయలు ఖర్చుచేయగా మిగతా నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది.

ఇక అంతకన్నా పెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరానికి మాత్రం అనేక సాకులు చూపిస్తూ జాతీయ హోదా ఇవ్వడానికి తిరస్కరించింది కేంద్రం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ని రాజకీయంగా వ్యతిరేకిస్తున్న టీఆరెస్ సర్కార్ ఉన్నది. ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి అనుమతులు లేవన్న సాకుతో జాతీయ హోదా తిరస్కరిస్తున్నట్టు పార్లమెంట్ లో కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ 2018లోనే సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ దరఖాస్తు చేసుకొన్నా ఏళ్ళకు ఏళ్ళు ఆ దరఖాస్తులను నానబెట్టి చివరకు అనుమతులు లేవంటూ చేతులెత్తేయడం పరిపాటిగా మారింది.

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఏ పనులూ జరగవని చెప్పదల్చుకున్నది బీజేపీ. అందుకే ఫెడరల్ సూత్రాలను తుంగలో తొక్కి రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తున్నదని విమర్షలు వస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ హోదా ఒక్క కర్ణాటకలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు మాత్రమే ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్‌లో కెన్‌-బెత్వా, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చింది. వీటన్నింటికన్నానే కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మాత్రం మొండిచేయి చూపించింది. కొన్ని రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని అంటే బీజేపీ నాయకులకు ఆగ్రహం వస్తుంది. మరి దీనికి వివక్ష అని కాకుండా వేరే ఏదైనా పేరుపెడతారా ?

First Published:  22 July 2022 12:11 PM IST
Next Story