Telugu Global
National

సోనియా, రాహుల్ చెప్పిన‌ట్టు పార్టీ వినాలా..?.. పార్టీ చెప్పిన‌ట్టు సోనియా, రాహుల్ వినాలా..?

ఒకవైపున అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ, మరోవైపున అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడుతున్న రాహుల్‌ గాంధీ వైఖరితో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు విసుగెత్తిపోయి వున్నారు.

X

ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కాంగ్రెస్‌ నాయకత్వంలో. అనేకానేక శక్తులు స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయి ఉండవచ్చు. కానీ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రజల్ని సంఘటితం చేసి స్వాతంత్య్ర సమరాన్ని నడిపింది కాంగ్రెస్‌ పార్టీ అన్నది చారిత్రక వాస్తవం. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మాత్రం ఆ పార్టీ నిస్తేజంగా మిగిలిపోయింది. స్వాతంత్య్ర సమరంలో లొంగుబాటు వైఖరిని ప్రదర్శించిన, సంకుచిత బుద్ధితో వ్యవహరించిన వారి వారసులు ఉత్సవాల నిర్వహణలో అత్యుత్సాహం ప్రదర్శించడం విరోధాభాస. ఎవరయితే త్యాగాలు చేశారో, ఏ పార్టీ అయితే భారత్‌ ఆధునిక రాజ్యంగా అవతరించడానికి దారులు పరిచిందో అది నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నది. నాయకత్వ లేమితో తండ్లాడుతున్నది.

ఒకవైపున అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ, మరోవైపున అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడుతున్న రాహుల్‌ గాంధీ వైఖరితో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు విసుగెత్తిపోయి వున్నారు. వారే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులు, ఎంతో రాజకీయ భవిష్యత్తు వున్న వివిధ రాష్ట్రాల నాయకులు అయోమయంలో పడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

దాదాపు పాతికేళ్ళుగా సోనియా, రాహుల్‌ గాంధీలే పార్టీ అధ్యక్షులుగా ఉంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీ అధ్యక్ష బాధ్యతల్నించి తప్పుకున్నారు రాహుల్‌. ఆ బాధ్యతల్లో లేనప్పటికీ ఇవాళ్టికీ కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీదే కీలక పాత్ర. ఆయనతో సంప్రదించకుండా నిర్ణయాలు జరగవు. ఆయన జోక్యం లేకుండా ఏ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు ముందుకు సాగవు. అయినప్పటికీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించడానికి రాహుల్‌గాంధీ సిద్ధంగా లేరు.

పార్టీకి అధ్యక్షుడు కాకపోయినప్పటికీ 2019 నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అగ్రభాగాన ఉన్నారు. సీట్ల కేటాయింపులు, విధివిధానాల నిర్ణయాలలో ఆయనదే అంతిమ నిర్ణయం. సోనియా, రాహుల్‌ తరువాత కాంగ్రెస్‌లో ఎవరు ముఖ్యులు అనే ప్రశ్నకు జవాబు ఉండదు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వైఫల్యం ఆ పార్టీకి, గాంధీ కుటుంబ వారసత్వానికి పెద్ద దెబ్బ. అసలు తొందరపడి ఆ రాష్ట్ర బాధ్యతలు ఆమెకు అప్పగించడమే పొరపాటు. దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ ప్రవేశంతో అద్భుతమైన మార్పులు సంభవించవు. ఆ రాష్ట్ర రాజకీయ వాస్తవికతని గుర్తించకుండానే ఆమెకు బాధ్యతలు అప్పగించి వైఫల్యాన్ని అంటగట్టారు. ఫలితంగా రాహుల్‌ కాదంటే ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిని చేయాలనే యోచనకు సుముఖత వ్యక్తం కావడం లేదు. నిజానికి ఆ బాధ్యతని స్వీకరించగలిగే అనుభవమూ ఆమెకు లేదు.

గాంధీ కుటుంబ వారసులే ఎందుకు?

ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన హత్యానంతరం సోనియా వెంటనే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లనే ఇతరులు కొంతకాలం పార్టీ నాయకులుగా ఉన్నారు. పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు ఆయనకీ, సోనియా గాంధీకి అభిప్రాయబేధాలు వచ్చాయి. పి.వి. స్వతంత్ర వైఖరి ఆమెకు గానీ, పార్టీలోని ఇతర సీనియర్‌ నాయకులకు నచ్చలేదు. అయినప్పటికీ ప్రధానిగా పూర్తి పదవీకాలంలో కొనసాగారు పి.వి. ఆ రోజుల్లో కొంతకాలం సీతారాం కేసరి పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. గాంధీ కుటుంబ వారసుల అభీష్టానికి భిన్నంగా వ్యవహరించినందున ఆయన ఇబ్బందులు పడ్డారు

రాజీవ్‌ అనంతరమూ ఆ పార్టీ గాంధీ కుటుంబ వారసత్వాన్ని నమ్ముకోడానికి ఆ కుటుంబానికి గల త్యాగాల చరిత్ర, జనాకర్షకశక్తి యే మూలం. రాజీవ్‌ మరణం తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న సోనియా క్రమంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. కనుక ప్రధాని పదవిలో ఎవరు ఉన్నప్పటికీ ఆమె మాటనే చెల్లుబాటు అవుతూ వచ్చింది. అంతేగాక వివిధ రాష్ట్రాలలో ఉన్న అసమ్మతి వర్గాల మధ్య సర్దుబాటుకు సోనియానే కేంద్ర బిందువయ్యారు. జనబాహుళ్యంలో ఉన్న చరిష్మా కారణంగా కాంగ్రెస్‌ పార్టీకి గాంధీ కుటుంబమే దిక్కు అనే స్థితి కొనసాగుతూ వచ్చింది. 1989 నుంచి ఓట్లు, సీట్లు తగ్గుతున్నప్పటికీ 2014 వరకు ఈ దేశంలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ మనగలిగింది. ఇలా కొనసాగడానికి, పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండటానికి గాంధీ కుటుంబం దోహదం చేసింది.

ఈ క్రమంలో ఆ పార్టీ, పార్టీ నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు పొరపాట్లు చేయకపోలేదు. ఆ పొరపాట్ల మూలంగానే ఇవాళ కాంగ్రెస్‌ నిస్తేజమైంది. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ప్రజలకు బలమైన శక్తిగా కనిపించడం లేదు. ఈ వాస్తవాల నడుమ ప్రజలకు కాంగ్రెస్‌ అంటే సోనియా, రాహుల్‌, ప్రియాంకనే కనిపిస్తున్నారు. ఈ ముగ్గురూ కాకుండా వేరే ఏ నాయకుడిని కాంగ్రెస్‌ రథసారథిగా ఊహించే పరిస్థితి లేదు. నిజానికి ఇది పార్టీ పునరుజ్జీవానికి ఉపయోగపడే సానుకూల బలం. వరుస పరాజయాలతో సతమతమవుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా నిర్మాణం కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. బిజెపిని ఎదుర్కోగల సత్తా దానికి తప్ప మరో పార్టీకి వుందని జనాలు భావించడం లేదు. ఈ పార్టీకి గాంధీ కుటుంబ వారసత్వమే బలం. ఈ వాస్తవాన్ని గుర్తించినందునే రాహుల్‌ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సీనియర్‌ నాయకులు పట్టుబడుతున్నారు.

ఈ వారసత్వమే అసలు బలహీనత

నెహ్రూ తర్వాత పార్టీ మీద పట్టు సంపాదించిన ఇందిరాగాంధీని ఆ పార్టీలోని నాయకులే ఎదుర్కొవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీలు పెట్టినప్పటికీ గాంధీ కుటుంబ వారసుల నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీనే మిగిలింది. శరద్‌పవార్‌, మమతా బెనర్జీ, వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌ నుంచి విడివడి సొంత పార్టీలు పెట్టినప్పటికీ ఆయా రాష్ట్రాలకే పరిమితమయ్యారు. దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయాన్ని చూపే పార్టీలుగా అవి ఎదగలేదు. సోనియా, రాహుల్‌ వారసత్వంలోని కాంగ్రెస్‌ మాత్రమే ఏకైక పెద్ద పార్టీగా ఉంది. గాంధీ కుటుంబాన్ని మినహాయించి కాంగ్రెస్‌ పార్టీని ఊహించే పరిస్థితి లేదు. ఇదే ఆ పార్టీ బలహీనత. అంతర్గత ప్రజాస్వామ్యం అమలయి నాయకులు ఎదిగి రావడానికి పార్టీ తోడ్పడాలి. కానీ సకల స్థాయిల్లో గాంధీ వారసుల భజన వల్ల ఆ పార్టీ నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్నది.

ఇదివరలో అర్జున్‌సింగ్‌, ప్రణబ్‌ ముఖర్జీ, శరద్‌ పవార్‌ వంటి వారు పార్టీ అధినాయకులు కావాలనుకున్నారు. అంతటి పలుకుబడి, వ్యవహారశైలి ఉన్నప్పటికీ గాంధీ కుటుంబం ముందు వారు నిలువలేకపోయారు. చిదంబరం, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ అజాద్‌ వంటి సమర్థులు ఉన్నప్పటికీ సోనియా, రాహుల్‌ తప్ప మరొకరి నాయకత్వాన్ని అంగీకరించేందుకు ఆ పార్టీలోని సీనియర్లే ముందుకు రావడం లేదు. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న వేళ మరల రాహుల్‌ గాంధీ నాయకత్వాన్నే కొందరు ప్రతిపాదించడం ఆ పార్టీ బలహీనత. పార్టీ బలం కోసం సంస్థాగత మార్పుల్ని కోరిన సీనియర్‌ నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించడం అనుహ్యం.

ఇక్కడ వారసత్వం దానికది చేటు కాదు. వారసత్వం ఇచ్చిన బలాన్నీ, ప్రభావాన్నీ, పలుకుబడినీ పార్టీ బలోపేతానికి వినియోగించకపోవడమే సమస్య. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట తల్లి, కొడుకు, కూతురు మాత్రమే కీలకం కావడం విపరిణామం. వారు ప్రతి సారి, ప్రతి సందర్భంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. అయినప్పటికీ వారే నిర్ణాయక స్థానాల్లో ఉండటం ఆ పార్టీ బలహీనత.

అంతర్గత ప్రజాస్వామ్యం ముఖ్యం

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి రాహుల్‌ గాంధీ సిద్ధంగా లేనప్పుడు ఇతరులకు ఆ బాధ్యతలు అప్పగించాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుండగా రాహులే కావాలనడం విడ్డూరం. దీనివల్ల ఆ పదవికి ఇతరులు పోటీ పడేందుకు వెనుకాడుతారు. చివరకు రాహుల్‌ గాంధీ అధ్యక్షుడు కాకుండా మరెవరో అధ్యక్షుడు అయితే అతడిని స్వతంత్రంగా పని చేయనిస్తారా అన్నది ప్రశ్న. సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీల జోక్యం నిలిచిపోతుందా? పార్టీ వర్కింగ్‌ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా గాంధీ కుటుంబ వారసులు పని చేస్తారా? నామమాత్రంగా పదవులకు దూరంగా ఉండటం కాదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సానుకూల పరిస్థితులు కల్పించడం వారసుల బాధ్యత. ఎవరినో కుర్చీలో కూర్చోబెట్టి పెత్తనం తాము చేస్తామనే వైఖరి తీసుకుంటే అది ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశమే.

ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొర‌వ‌డింది. అధినేత మాటనే వేదవాక్కు. ఈ పరిస్థితి మారడం అవసరం. సమర్థ నాయకత్వం స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే వాతావరణం ప్రధానం. ఇవి కొరవడితే పార్టీ మనుగడ కష్టం. ముఖ్యంగా విశ్వసనీయతనే ప్రమాదంలో పడుతుంది. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ను బిజెపి వాంఛిస్తోంది. కానీ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నవారికి కాంగ్రెస్‌ మీద ఇంకా నమ్మకాలు సన్నగిల్లలేదు. వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయపార్టీలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్‌ వైపు చూస్తున్నాయి. ఈ స్థితిలో స్పష్టమైన వైఖరి తీసుకోడం, నాయకత్వ సమస్యని చిత్తశుద్ధితో పరిష్కరించుకోవడం కాంగ్రెస్‌ పార్టీ విధి. మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే తమని బతకనిస్తుందా అని ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నాయి. చివరకు పరిస్థితి ఏకపార్టీ వ్యవస్థకు దారితీస్తుందా అనే భీతావహ స్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో దేశం కోసం, పార్టీ కోసం తాము ఎలాంటి పాత్రని పోషించాలో గాంధీ కుటుంబ వారసత్వం కచ్చితమైన, నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలి. పార్టీ చెప్పినట్టు తాము వినాలా? లేదా తాము చెప్పినట్టు పార్టీ వినాలా? అన్న వారి నిర్ణయమే అంతిమంగా ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

First Published:  25 Aug 2022 6:00 AM IST
Next Story