కర్ణాటక, తెలంగాణ సక్సెస్.. సునీల్ కనుగోలుకు కీలక బాధ్యతలు
కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్, పార్టీ కమ్యూనికేషన్ టీం సభ్యులు ఇదే విషయమై సునీల్ కనుగోలుతో పలుమార్లు సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. అదే వ్యూహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ అనుసరించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను పూర్తిస్థాయిలో సునీల్ కనుగోలుకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సునీల్ కనుగోలు వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
లోక్‌సభతో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను సైతం సునీల్ నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్, పార్టీ కమ్యూనికేషన్ టీం సభ్యులు ఇదే విషయమై సునీల్ కనుగోలుతో పలుమార్లు సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.
కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు సునీల్ కనుగోలు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలను రచించడంలో ఆయనదే కీ రోల్. 2014కు ముందు ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పని చేశారు సునీల్ కనుగోలు. ఇక రాహుల్ గాంధీ గతేడాది నిర్వహించిన భారత్ జోడో యాత్రలోనూ సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు.