Telugu Global
National

ఫేమ్ కాదది బడా స్కామ్.. రూ. 2వేల కోట్ల కుంభకోణం.. పట్టించుకోని కేంద్రం

హీరోతో పాటు మరో 11 కంపెనీలు కూడా ఇలాంటి స్కామ్‌లో భాగస్వామ్యం అయ్యాయి. ఈ విషయం తెలిసినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది.

ఫేమ్ కాదది బడా స్కామ్.. రూ. 2వేల కోట్ల కుంభకోణం.. పట్టించుకోని కేంద్రం
X

కళ్ల ముందే వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నా.. కేంద్రం కళ్లు మూసుకున్నది. ఎనిమిది నెలల కిందటే ఈ బడా స్కామ్ గురించి వార్తలు వెలువడినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది. ఫేమ్ పేరుతో తీసుకొచ్చిన పథకాన్ని ఉపయోగించుకొని ఆటోమొబైల్ కంపెనీలు బడా స్కామ్‌కు తెరలేపినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. మేకిన్ ఇండియా అంటూ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వాహనాలు అన్నీ ఫేక్ ఇన్ ఇండియానే అని స్పష్టం అవుతోంది. రూ.2వేల కోట్లకుపైగా కుంభకోణానికి ఫేమ్-2 పథకం వేదికైంది. ఈ కుంభకోణం కారణంగా వినియోగదారులకు భారీ నష్టం, ప్రాణాపాయం కూడా కలగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

దేశంలో పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచాలనే ఉద్దేశంతో 'ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికిల్స్' (ఫేమ్-2) పథకాన్ని తీసుకొని వచ్చింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే ప్రతీ ఆటోమొబైల్ కంపెనీ స్వదేశంలో తయారైన పరికరాలను మాత్రమే వాడాలి. కానీ బడా ఆటోమొబైల్ కంపెనీలు చైనా నుంచి బ్యాటరీలతో పాటు ఇతర విడిభాగాలు దిగుమతి చేసుకొని 'మేకిన్ ఇండియా' అంటూ భారీగా సబ్సిడీని పొందుతున్నాయి.

ఇటీవల కాలంలో ఈవీ టూవీలర్స్ తరచూ ప్రమాదాలకు గురవడం చూస్తున్నాము. బ్యాటరీలు పేలిపోవడం, అగ్నికి ఆహుతి అవుతుండటంతో వినియోగదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అప్పట్లో బ్యాటరీకి చార్జింగ్ పెడుతుండగా పేలి ఓ వ్యక్తి చనిపోయాడు. సికింద్రాబాద్‌లో కూడా ఎలక్ట్రికల్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి అస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. దీనికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలే కారణమని నిపుణులు తేల్చి చెప్పారు. ఫేమ్-2 పథకంలో చేరి మేకిన్ ఇండియా పేరుతో చైనా పరికరాలు దిగుమతి చేసుకుంటూ.. భారీగా సబ్సిడీని కూడా పొందుతున్నాయి.

ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిదారులైన హీరో ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రైవేట్ లిమిటెడ్, ఒకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు విద్యుత్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలతో సహా ముఖ్యమైన పరికరాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నట్లు ఏప్రిల్‌లో పలు నివేదికల్లో స్పష్టమైంది. స్వదేశీ పరిజ్ఞానాన్నే వాడాలన్న నిబంధనను తుంగలో తొక్కి సదరు కంపెనీలు విదేశాల నుంచి పరికరాలను తెప్పించుకొంటున్నాయి. పైగా ఫేమ్-2 ద్వారా ప్రతీ వాహనానికి రూ. 30వేల చొప్పున సబ్సిడీని కూడా పొందుతున్నాయి. ఒక్క హీరో ఎలక్ట్రిక్ కంపెనీనే రూ.400 కోట్లు ఇలా దొడ్డిదారిన సబ్సిడీ పొందినట్లు తెలుస్తున్నది.

హీరోతో పాటు మరో 11 కంపెనీలు కూడా ఇలాంటి స్కామ్‌లో భాగస్వామ్యం అయ్యాయి. ఈ విషయం తెలిసినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. కేంద్రంలోని పెద్దల సహకారంతోనే ఈ తతంగం అంతా జరుగుతున్నదేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఫేస్-2 ద్వారా జరగుతున్న భారీ స్కామ్‌ను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రమణ్ ట్విట్టర్ వేదికగా బహిర్గతం చేశారు. దీనిపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేస్తున్న హీరో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బెన్‌లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఒకాయా ఈవీ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, రివోల్ట్ ఇంటెల్లికార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోన్ సైకిల్స్ లిమిటెడ్, లోహియా ఆటో ఇండస్ట్రీస్, తుక్రాల్ ఎలక్ట్రిక్ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్, విక్టరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఈ స్కామ్‌లో భాగస్వామ్యం అయ్యాయి.

ఈ 12 కంపెనీలు నెలకు సగటున 30 వేల ఈవీలు తయారు చేస్తున్నాయి. గత రెండేళ్లలో సదరు కంపెనీలు మొత్తం 7,20,000 ఈవీలు ఉత్పత్తి చేశాయి. ఒక్కో ఈవీకి కేంద్రం రూ.30వేల సబ్సిడీ ఇస్తోంది. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు రూ.2,160 కోట్ల మేర దొడ్డి దారిన సదరు కంపెనీలు కొట్టేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, ఫేమ్-2పై స్కామ్ ఆరోపణలు రావడంతో కేంద్రం హడావిడిగా మేల్కొంది. స్కీమ్‌ను దుర్వినియోగం చేసిన సంస్థలపై దర్యాప్తు చేపడతామని పేర్కొంది.

First Published:  22 Dec 2022 6:30 AM GMT
Next Story