ఆడ-మగ వివక్ష అక్కడే ఎక్కువ..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. హెల్త్ కేర్ రంగంలో పనిచేసే మహిళలు ఎక్కువగా ఆర్థిక వివక్షతకు గురవుతున్నారు.
పల్లెటూళ్లనుంచి పట్టణం దాకా.. మగవారికి ఇచ్చే కూలీ డబ్బులు ఎక్కువ. ఇది కేవలం కూలి పనులకే పరిమితం కాదు.. ఆడవారు డాక్టర్ అయినా, లాయర్ అయినా, జర్నలిస్ట్ అయినా, ఇంకా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా.. మగవారితో పోల్చి చూస్తే వారికి కంపెనీలు చెల్లించే జీతాలు తక్కువ. సహజంగా ఇలాంటి 'జెండర్ పే గ్యాప్' మిగతా రంగాల్లో 20 శాతం వరకు ఉంటుంది. కానీ అది వైద్య రంగంలో ఇంకాస్త ఎక్కువగా ఉందని తెలుస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. హెల్త్ కేర్ రంగంలో పనిచేసే మహిళలు ఎక్కువగా ఆర్థిక వివక్షతకు గురవుతున్నారు.
రాశి ఎక్కువ.. వాసి తక్కువ
ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ రంగంలో పనిచేసేవారిలో మహిళల సంఖ్య ఎక్కువ. 60శాతం మంది మహిళలు ఈ రంగంలో ఉంటే కేవలం 40 శాతం మంది పురుషులు మాత్రమే హెల్త్ కేర్ రంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కానీ, జీతం విషయానికొచ్చే సరికి మగవారికి చెల్లింపులు ఎక్కువ, ఆడవారికి వడ్డింపులు తక్కువ. భారత్ లో కూడా ఈ పరిస్థితి కనపడుతోంది. వైద్యరంగంలో ఇలాంటి వివక్ష ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం అంటున్నారు నిపుణులు. నర్స్ లు అయినా, డాక్టర్లు అయినా, ఇతరత్రా హోదాల్లో ఉన్నవారయినా.. ఆడవారికి చెల్లించే మొత్తం మాత్రం తక్కువే.
మౌన పోరాటం..
ముఖ్యంగా ఆడవారు తల్లులయ్యే సమయంలో వృత్తిని వదిలేయడం, వృత్తికి దూరంగా ఉండటం వల్ల రీఎంట్రీ టైమ్ లో వారు తగినంత పారితోషికాన్ని అందుకోలేకపోతున్నారని చెబుతున్నారు. మగవారికి ఇలాంటి సమస్యలు ఉండవు కాబట్టి వారు అన్ని రంగాల్లోనూ ఆడవారికంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. ఆడ, మగ ఇద్దరు చేసే పని, హోదా ఒకటే అయినా మగవారికంటే ఆడవారికి జీతం తక్కువగా ఇస్తున్నారు. ఈ విషయంలో ఆడవారు ఎప్పుడూ సమానత్వం కోసం పోరాటం చేయలేకపోవడం విశేషం. మౌనంగానే ఆడవారు 'జెండర్ పే గ్యాప్' ని భరిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.