కొత్త ప్రయత్నం.. పార్లమెంట్ గ్యాలరీలో విద్యార్థులు
పార్లమెంటరీ కార్యక్రమాలకు హాజరై తమ అభిప్రాయాలను పంచుకోవాలనుకునే ఆసక్తిగల పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు సభ ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తోందని చెప్పారు ఉప రాష్ట్రపతి.
పార్లమెంట్ లో సందర్శకుల గ్యాలరీలు రెండేళ్లుగా బోసిపోయాయి. భద్రతా కారణాలు, కొవిడ్ ప్రొటోకాల్స్ అంటూ సవాలక్ష కండిషన్లతో సందర్శకులకు అనుమతులు రద్దు చేశారు. మీడియా కూడా తమకు కేటాయించిన ప్రదేశంలోనే సభ్యుల ఇంటర్వ్యూలు తీసుకునే అవకాశముంది. అయితే ఈ పద్ధతుల్లో మార్పులు రాబోతున్నాయి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు.
ఇటీవల ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో జరిగిన రచ్చపై చైర్మన్ జగదీప్ ధన్ కర్ కాస్త సీరియస్ గానే స్పందించారు. మనమేమైనా చిన్న పిల్లలమా అంటూ చురకలంటించారు. సభ బయట చేసిన వ్యాఖ్యలపై సభలో రచ్చ అనవసరం అని తేల్చేశారు. తాజాగా ఆయన చిన్న పిల్లలను, యువతను పార్లమెంట్ గ్యాలరీలోకి ఆహ్వానిస్తానంటున్నారు. దీనిపై ఇప్పటికే వివిధ స్కూల్స్ నుంచి అభ్యర్థనలు వచ్చాయని, దీనికోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తామని అన్నారు. పార్లమెంటరీ కార్యక్రమాలకు హాజరై తమ అభిప్రాయాలను పంచుకోవాలనుకునే ఆసక్తిగల పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు సభ ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తోందని చెప్పారు.
బాధ్యతగా ఉంటారా..?
చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన ఇటీవల మరీ శృతిమించిపోతోంది. క్రమశిక్షణ ఏకోశానా కనపడ్డంలేదు. గతంలో పోడియం వద్దకు వెళ్లడమే క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించేవారు. ఇప్పుడు పోడియం చుట్టూ చేరి గోలచేయడం, పేపర్లు చించడం, పెప్పర్ స్ప్రేలు.. ఇలా రకరకాల ఉదాహరణలున్నాయి. సభా కార్యక్రమాలు టీవీలో లైవ్ లో వస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. కనీసం స్కూల్ పిల్లలు, యువత తమ చుట్టూ ఉన్నారనే భావన ఉంటే అయినా నాయకులు బాధ్యతగా మసలుకుంటారేమో చూడాలి.
సభా కార్యక్రమాల్లో భాగమైన విద్యార్థులు ఆ తర్వాత తమ అనుభవాలను సంసద్ టీవీలో పంచుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయబోతున్నామన్నారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్. మొత్తమ్మీద పార్లమెంట్ వ్యవహారాల్లో ఇదో సరికొత్త ముందడుగు అని చెప్పాలి. పార్లమెంట్ సమావేశాల్లో సందర్శకుల గ్యాలరీల్లో ఇకపై విద్యార్థులు, యువత కనపడతారు.